స‌రిహ‌ద్దు రాష్ట్రమైన జమ్ముకశ్మీర్‌లో మ‌రోమారు క‌ల‌కలం మొద‌లైంది. ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న వివాదాస్పద ఆర్టికల్ 35-ఏ ఆ రాష్ర్టాన్ని కుదిపేస్తోంది. ఈ అధికరణను తొలిగించాలంటూ సంఘ్‌పరివార్‌కు చెందినదిగా భావిస్తున్న వి ద సిటిజన్స్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌తో తెర‌మీద‌కు వ‌చ్చిన వివాదం ఇంకా కొన‌సాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీడీపీ, వేర్పాటువాద సంస్థలు, గ్రూపులు  ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఆర్టికల్‌ను తొలిగిస్తే ఊరుకునేది లేదని, కశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామని వేర్పాటువాద సంస్థలు హెచ్చరించాయి. ఈ గొడ‌వ‌లోకి మాజీముఖ్య‌మంత్రి మెహ‌బూబా ముఫ్తీ రంగ ప్రవేశం చేశారు.


జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 35ఏ అధికరణాన్ని రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వార్తల నేపథ్యంలో మోదీ ప్రభుత్వాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు సాయపడాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధినేత ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన ప్రత్యర్థి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తీ కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు వ్యతిరేకంగా ఉమ్మడిగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను కోరుతున్నాను అని ట్వీట్ చేశారు. దీనిపై ప్రతిస్పందించిన ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ దీనిపై నేను సానుకూలంగా ఉన్నా. ఈ వారంలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తా అని అన్నారు. 35ఏ అధికరణాన్ని వచ్చేనెల 15న రద్దు చేయాలని, ఈ నేపథ్యంలోనే లక్ష మంది అదనపు బలగాలను మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు తరలించిందని వార్తలొచ్చాయి.


పీడీపీని నెలకొల్పి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్ముకశ్మీర్‌లో శాశ్వత నివాసం కలిగిన వారికి ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏను మార్చాలని లేదా రద్దు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని  కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. `ఆర్టికల్ 35ఏ జోలికి వెళ్లాలనుకోవడం నిప్పుతో చెలగాటమాడటమే అవుతుంది. ఎవరైనా దీన్ని ముట్టుకోవాలని చూస్తే బూడిదైపోతారు అని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ర్టానికి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హోదా, హక్కులను కాపాడటంలో తమ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని చెప్పారు. నన్ను జైల్లో పెట్టినా సరే.. రాష్ట్ర హక్కులను కాపాడుకుంటా అని మెహబూబా అన్నారు. ఆర్టికల్ 35ఏను రక్షించుకోవడానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రాణాలు పోయేవరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. కానీ మనకు నిజమైన పరీక్ష ఏమిటంటే.. మన హక్కులను కాపాడుకోవడం. ఆర్టికల్ 35ఏను రక్షించుకోవడం. ఈ విషయంలో ఏ పోరాటానికైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి` అని కోరారు.


ఇదిలాఉండ‌గా, జాయింట్ రెసిస్టెన్స్ లీడర్‌షిప్(జేఆర్‌ఎల్) పేరుతో వేర్పాటువాదులు సయ్యద్ అలీ జిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, యాసిన్ మాలిక్ జేఏసీగా ఏర్పడి ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చి తమ నిరసనను తెలుపాలని వాళ్లు పిలుపునిచ్చారు. ఆర్టికల్ 35-ఏ వల్ల చేకూరే ప్రయోజనాలు, రద్దు చేస్తే వచ్చే నష్టాలపై రూపొందించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో కశ్మీర్ లోయలో చక్కర్లు కొడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: