విజయనగరం సంస్థానం వ్యవహారాల్లో కూడా జగన్ ప్రభుత్వం తలదూర్చిందని, 1958లో ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను, గజపతిరాజుల సంస్థానానికి మూలపురుషుడైన పీ.వీ.జీ. రాజు తన తండ్రి గారైన మహారాజా అలక్ నారాయణ గజపతి పేరుతో స్థాపించడం జరిగిందని, ఆనాడు ఆయనస్థాపించిన ట్రస్ట్  కొన్ని విధివిధానాలు, నియమనిబంధనల ప్రకారం నేటికీ నిర్వహించడం జరుగుతోందని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.  ట్రస్ట్ ను స్థాపించినప్పుడే పీ.వీ.జీ.రాజు ట్రస్ట్ చైర్మన్ గా ఉండి, తన కుమారులైన ఆనందగజపతి రాజు, అశోక్ గజపతిరాజులను మెంబర్లుగా నియమించడం జరిగిందన్నారు. 

 

వారు నెలకొల్పిన అనేక విద్యాసంస్థలనుకూడా ట్రస్ట్ అధీనంలోకి తీసుకొచ్చి, దాని నిర్వహణకోసం 13వేల ఎకరాలను దాతృత్వంగా ట్రస్ట్ కు కేటాయించడం జరిగిందన్నారు. ఆభూమిపై వచ్చే ఆదాయంతోనే ట్రస్ట్ పరిధిలోని వివిధవిద్యాసంస్థలు నడిచేలా ఏర్పాట్లు చేయడంజరిగిందన్నారు. విజయనగరాన్ని విద్యల నగరంగా మార్చడానికి మాన్సాస్ ట్రస్ట్ ఎంతో కృషిచేసిందని, ఘంటసాల వేంకటేశ్వరరావు , పీ.సుశీల, ద్వారం వేంకటస్వామినాయుడు  వంటి ఎందరో మహానుభావులు, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. విజయనగరం ఎమ్. ఆర్.కళాశాలంటే తెలియనివారులేరని, దానితోపాటు, విజయనగరం కోటనే మహిళల విద్యకోసం కేటాయించిన గొప్ప కుటుంబం పీ.వీ.జీ.రాజుదని కళా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నిప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ఎవరూకూడా విజయనగరం రాజుల అధీనంలోఉన్న మాన్సాస్ ట్రస్ట్ జోలికి, దాని అధీనంలో ఉన్న విద్యాసంస్థలజోలికి వెళ్లలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తొలిసారి రాష్ట్రప్రభుత్వానికి చెందిన ప్రముఖనేత, ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందులోభాగంగానే ఆనందగజపతిరాజు రెండోకుమార్తె అయిన సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. 


అప్పటికప్పుడు రహస్యంగా జీవో ఇచ్చి, సంచితను ఛైర్మన్ గా నియమించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందో, తరతరాలుగా వస్తున్న రాజకుటుంబం సంప్రదాయాలకు విరుద్ధంగా ఎందుకు నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేలా కొనసాగిస్తున్న తన చర్యలను జగన్మోహన్ రెడ్డి, విజయనగరం రాజుల కుటుంబంలోకి తీసుకెళ్లడంపై, విజయనగరం వాసులతో పాటు, మాన్సాస్ ట్రస్ట్ దయతో విద్యాబుద్ధులు నేర్చుకున్నవారందరూకూడా తీవ్రంగా తప్పుపడుతున్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. ప్రజలసమస్యలు పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం, రాజకుటుంబీకుల వ్యవహారాల్లో వేలుపెట్టడం ఎంతవరకు సమంజసమని కళా నిలదీశారు. 

పీ.వీ.జీ.రాజు కుమారుల్లో ఒకరైన ఆనందగజపతిరాజుకి అబ్బాయిలు లేరని, అందువల్లే ఆయనకు తమ్ముడైన  అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారన్నారు.  ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు కలుగచేసుకుందో ప్రజలకు చెప్పాలన్నారు. నెలరోజుల క్రితం ఢిల్లీలో సంచితను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి, సాక్షి టీవీలో ప్రసారంచేశారని, తర్వాత సాక్షిపత్రికలో అదే ఇంటర్వ్యూ కథనాన్ని ప్రచురించారన్నారు. ఇవన్నీ జరిగిన 15రోజుల తర్వాత సింహాచలం దేవస్థానానికి కమిటీవేసిన ప్రభుత్వం, అశోక్ గజపతిరాజుని ఛైర్మన్ గా, సంచిత గజపతిరాజుని మెంబర్ గా నియమించడం జరిగిందన్నారు. ఇది జరిగాక మాన్సాస్ ట్రస్ట్ లోవేలుపెట్టిన ప్రభుత్వం, దానికింద ఉన్న రూ.లక్షా30వేలకోట్ల విలువచేసే 13వేల ఎకరాల భూమిపై కన్నేసిందన్నారు. 

 

రాజకుటుంబం మధ్యన చిచ్చుపెట్టి, ట్రస్ట్ నడవడంలేదని చెప్పి, ఆభూములు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే, సంచితను ట్రస్ట్ ఛైర్మన్ గా నియమించారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. ఏపీలో తిరుపతి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయమైన సింహాచల దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు కొనసాగుతుంటే, 3వతేదీన మరో కొత్తజీవో ఇచ్చి, సంచిత గజపతిరాజునే ఆలయ ఛైర్మన్ గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  20 రోజుల్లోనే అశోక్ గజపతి రాజుస్థానంలో సంచితను ఎందుకునియమించారు.. ప్రభుత్వంలోని ఆ కీలకనేత రాజకుటుంబం వ్యవహారాల్లో ఎందుకు కలగచేసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, తిరిగి ప్రశ్నలేస్తూ కట్టుకథలు చెబుతూ తప్పించుకుంటోందన్నారు. 


సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న 9వేల ఎకరాల భూములపై కన్నేసిన జగన్ సర్కారు, రూ.9లక్షలకోట్ల విలువచేసే ఆ భూమికి ఎసరు పెట్టిందన్నారు. ఎప్పటినుంచో ఉన్న వంశపారంపర్య ధర్మకర్తనుకాదని, 30ఏళ్ల వయసుకూడాలేని సంచితను తెరపైకి తీసుకురావడం వెనుక ప్రభుత్వం పెద్ద కుట్రే చేస్తోందని కళా తెలిపారు. రాజకుటుంబం వ్యవహారాల్లో వేలుపెట్టి, లక్షలకోట్ల విలువైన ఆస్తులను కొట్టేయాలన్న ఆలోచన ఉండబట్టే, 20రోజుల వ్యవధిలోనే దేవస్థానం మెంబర్ గా ఉన్న సంచితను ఛైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఇవన్నీ చూస్తుంటే, జగన్ ప్రభుత్వం కావాలనే ట్రస్ట్ వ్యవహారాల్లో, దేవస్థానం విషయాల్లో జోక్యం చేసుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజుల కుటుంబాన్ని విచ్ఛిన్నంచేయాలన్న దుర్భుద్ధి జగన్ ప్రభుత్వానికి ఉందని,  ప్రభుత్వం జారీచేసిన జీవో చూస్తే ఆ విషయం బోధపడుతోం దన్నారు. ఒడిస్సాలోని రాజులుకూడా సింహాచలం దేవస్థానానికి భూములు ఇచ్చారని, హిందూ మత విశ్వాసాలపై జగన్ ఎందుకు దాడిచేస్తున్నారో ప్రజలే ఆలోచించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: