ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించి పంపిన విభజన బిల్లును కొన్ని సవరణలతో లోక్ సభ చేత అప్రజాస్వామ్య రీతిలో ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రజావ్యతిరేక సంప్రదాయాన్ని ఆవిష్కరించింది. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ లో పట్ట పగలు చేసిన ప్రజాస్వామ్య హత్య గా ప్రజలు దీనిని భావిస్తున్నారు. విభజన బిల్లు ను ఆమోదించే విషయం లో కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యల మూలంగా దివంగత నాయకుల విగ్రహాలకు సీమాంధ్ర లో పోలీసు కాపలా పెట్టవలసిన దుస్థితి నేడు రాష్ట్రం లో నెలకొంది. కాంగ్రెస్ పార్టీ, బిజెపి తో కలసి లోక్ సభ లో ఆడిన నాటకం లో చివరికి ఓడిపోయింది ప్రజాస్వామ్యం, జరిగింది ప్రజాస్వామ్య విధ్వంసం అనడం లో సందేహం లేదు. అంతా చేసి, తాపీగా మా పార్టీ తప్పు లేదు ఇదంతా ఇతర పార్టీలు విభజన కు అనుకూలం గా ఇచ్చిన లేఖల మూలంగానే, అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ నాయకులను "వాళ్లకు బుద్ధి లేకపోతే సరి, మరి మీ బుద్ధి ఏమయ్యింది" అని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన గురించి అనేక వేల గంటలు మీడియా లో పత్రికల్లోనూ చర్చ జరిగిన మాట వాస్తవం. అయితే కీలకం అయిన విభజన బిల్లు పై లోక్ సభ లో చర్చ ను కేవలం గంటన్నర సమయం లో ముగించడం ఎంతవరకు సబబు? విభజన బిల్లు పై రాష్ట్ర అసెంబ్లీ నుండి ప్రతిపాదించబడి ఢిల్లీ కి చేరిన తొమ్మిది వేలకు పైగా సవరణలు ఎటుపోయ్యాయో కూడా తెలియదు. తెలంగాణా కు అనుకూలమైన జనత దళ్ - యు అధ్యక్షుడు శరద్ యాదవ్ లోక్ సభ లో విభజన బిల్లు పై మాట్లాడే అవకాశం లేక చివరికి వాకౌట్ చెయ్యడం విచారకరం. విభజన వాదుల పక్షాన ఆంధ్ర ప్రదేశ్ నుండి జైపాల్ రెడ్డి ఒక్కరు మాట్లాడితే సరిపోతుందా, సమైక్య రాష్ట్రం గురించి సీమాంధ్ర ఎంపి లకు లోక్ సభ చర్చ లో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోక్ సభ లో తలుపులు వేసి, కర్టెన్లు వేసి, ఏ రాష్ట్రాన్ని అయితే విభజిస్తున్నారో ఆ రాష్ట్రానికే చెందిన 20 మంది ఎంపి లను లోక్ సభ బయటకు నెట్టి , 30 మందికి పైగా ఇతర రాష్ట్ర ఎంపి లను రాష్ట్రేతర కేంద్ర మంత్రులకు స్పీకర్ కు రక్షణ గా పెట్టి, పైగా ప్రత్యక్ష ప్రసారాలు అర్ధాంతరంగా నిలిపి వేసి బలవంతాన విభజన బిల్లు ఆమోదింపజేసిన సంఘటన దేశ చరిత్ర లో ఒక చీకటి అధ్యాయం గా మిగిలిపోతుంది. ఒక పక్క శరద్ యాదవ్ ప్రత్యక్ష ప్రసారం కట్ చేసిన పిదప నిరసన గా వాకౌట్ చేసాను అని చెబుతుంటే, మరో పక్క గౌరవనీయులు అయినటువంటి బిజెపి పార్లమెంటరి నేత సుష్మా స్వరాజ్ గారు అసలు ప్రత్యక్ష ప్రసారం కట్ విషయం తనకు తెలియదని అడ్డంగా చేస్తున్న బుకాయింపు చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కుమ్మక్కు అయ్యాయి అన్న విషయం స్పష్టం గా తెలుస్తుంది. పైగా బిజెపి వారు స్పీకర్ ను కలసి ప్రత్యక్ష ప్రసారాలు అర్ధాంతరంగా నిలిపి వేయడం పై వివరణ అడుగుతారంట! వీళ్ళ నిజ స్వరూపం బట్టబయలు అయ్యిన తరువాత కూడా, ఏదో చేస్తున్నాము అని వీళ్ళు చెబితే మోసపోవడానికి ప్రజలు ఎవరూ సిద్ధం గా లేరు. విభజన బిల్లు పై చర్చ జరుగుతున్నప్పుడు ఒక గంట సేపు లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలు అర్ధాంతరంగా నిలిపివేస్తే తప్పు ఏమిటి అని అడ్డంగా వాదిస్తున్న వేర్పాటు వాదుల తీరు చూసి ప్రజలు విస్మయం చెందుతున్నారు. విభజన బిల్లు చర్చకు వచ్చిన నేపధ్యం లో దేశం లో అత్యున్నత సభ అయినటువంటి లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలు అర్ధాంతరంగా నిలిపివెయ్యడం లాంటి తెంపరితనం కు పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ లో కూడా ఇటువంటి కుట్రలకు తెర తీస్తోందేమోనన్న శంక కొంతమందికి ఉంది. అయితే దళిత మహోన్నతుడు అయినటువంటి జగ్జీవన్ రామ్ కడుపున పుట్టి కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాసి స్పీకర్ పదివికే చెడ్డపేరు తెచ్చిన లోక్ సభ స్పీకర్ మీరా కుమారి లాగా రాజ్య సభ చైర్మన్ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి ప్రవర్తించడు అని ఆశించడం లో కొంత అర్ధం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లోక్ సభ కు మునుపు మొదట రాజ్యసభ లో విభజన బిల్లు పెట్టమని జారి చేసిన హుకుం ను ఉపరాష్ట్రపతి గారు ధిక్కరించి, సదరు బిల్లును కేంద్ర ప్రభుత్వానికి తిరగగొట్టిన విషయం అందరికీ విదితమే. లోక్ సభ ఎపిసోడ్ లో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, విభజన బిల్లు పై మాట్లాడడానికి తీరిక ఉన్న బిజెపి కి, బిల్లు కు సీమాంధ్ర కు మేలు చేసే సవరణలు ప్రతిపాదించడానికి సమయం లేదట, కాబట్టి వాటిని రాజ్య సభ లో ప్రతిపాదిస్తారట! ఒకవేళ సమయం లేకపోతే లేదా వీలుపడక పోతే బిజెపి ప్రభుత్వం వచ్చాక సవరణలు తీరిగ్గా పరిశీలిస్తారట! అంటే ఇప్పుడు ఉన్న అవకాశం జారవిడుచుకొని రేపు మేము అధికారం లోకి వచ్చాక బిజెపి వారు ఏదో చేస్తాము అంటున్నారు, మరి రేపు బిజెపి అధికారం లోకి రాకపోతేనో? 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కేది కేవలం 60 సీట్లు మాత్రమే అయితే, బిజెపి కి 150, మిగిలినవి థర్డ్ ఫ్రంట్ కు దక్కే అవకాశం ఉందని మమతా బెనర్జీ ఇప్పటికే లెక్కలు కట్టారు. ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నా, మమతా బెనెర్జీ చెప్పినదాని ప్రకారం ఒకవేళ థర్డ్ ఫ్రంట్ కు రేపు అధికారం వస్తే అప్పుడు సీమాంధ్ర కు బిజెపి ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారు? ఇప్పటివరకు జరిగిన విభజింపబడ్డ రాష్ట్రాల చరిత్ర చూస్తే, నిర్దిష్ట కేటాయింపులు ఉంటే తప్ప ఏదో చూస్తాము పరిశీలిస్థాము చేస్తాము అంటే చివరికి ప్రజలకు దక్కేది ఖాళీ చిప్ప మాత్రమేనని అందరికీ ఎరుకే. విభజన బిల్లు కు వ్యతిరేకంగా లోక్ సభ లో పోరాడిన రాష్ట్రేతర ప్రాంతీయ పార్టీల తీరును పరిశీలిస్తే, తెలంగాణా ఏర్పాటు మూలంగా వారి వారి రాష్ట్రాల్లో విభజన కుంపట్లు మళ్లీ రాజుకుంటాయోనన్న భయమే వారిని తెలంగాణా బిల్లు కు వ్యతిరేకంగా పోరాడమని పురిగొల్పాయి అని భావించవలసి వస్తుంది. వారి ఆందోళన సహజమే ఎందుకంటే, మాతృ రాష్ట్రం లో అసెంబ్లీ తీర్మానం లేకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రాన్ని విభజించలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను సమర్దిస్తే వారి వారి రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం లేకపోయినా కూడా కేంద్రం చెయ్యబొయ్యే విభజన ను సమర్ధించినట్లు అవుతుంది అని బెంగాల్ నుండి తృణముల్ కాంగ్రెస్, యు పి నుండి సమాజ్ వాది పార్టీ, జమ్మూ కాశ్మీర్ నుండి ఫరూక్ అబ్దుల్లా భావించడం లో తప్పు లేదు. కానీ మరిన్ని ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి ఆందోళనలు కనిపించకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఈ లెక్కన మెజారిటీ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆంధ్ర ప్రదేశ్ విభజన లో ఎటుపోతే మనకేమిటి అనే భావన లో ఉన్నారు అని అనుకోవలసి వస్తుంది. ఒక వేళ ఇది నిజం అయితే, సీమాంద్ర ప్రజల్లో మేము ఒంటరి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అనే శంక పెరిగి పెద్దదై, మరో ప్రజా ఉద్యమానికి దారి తీసి ఏకం గా మరో సారి దేశ విభజన కే దారి తీయవచ్చు అని ప్రజలు భయపడుతున్నారు. బెంగాల్ నుండి ఈస్ట్ బెంగాల్ విభజించిన తరువాత జరిగిన పరిణామాలలో ఈస్ట్ బెంగాల్ ఒక దేశం అయిన విషయం విదితమే. 60 ఏండ్లుగా జరుగుతున్న విభజన ఉద్యమాన్ని విస్మరించి, కుంభకర్ణుడి లాగా సీమాంద్ర ప్రజలు నిద్దరోతున్నారు అని కొంత మంది వేర్పాటు వాద నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన అవ్వదు, ఒక వేళా అయితే గియితే 2001 లో CWC చేసిన తీర్మానం ప్రకారం రెండో SRC బట్టి అవుతుంది లేదా తెలంగాణా కు ప్యాకేజ్ తో సరి పెడతారు అని సీమాంద్ర ప్రజలు నిన్నా మొన్నటి వరకు భావించారు. కాంగ్రెస్ CWC తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం గా జూలై 30, 2013 న నిర్ణయాన్నిప్రకటించగానే సమైక్య ఉద్యమం తారాస్థాయి కి చేరింది అని గమనించాలి. ఎందుకంటే కేవలం కండువాలు మార్చుకున్నంత మాత్రాన్న సమైక్య ఉద్యమాలు సీమాంధ్ర లో మొదలవ్వాలి అని వేర్పాటు వాదులు కోరుకోవడం అమాయకత్వం కాదా? అదే ప్రాతిపదిక అయితే ఈ పాటికి ఒక 500 పైచిలుకు రాష్ట్రాలు ఈ దేశం లో ఏర్పడి ఉండి ఉండేవి. హార్వార్డ్, ఎంఐటి యూనివర్సిటీల నుండి మన దేశానికి దిగుమతి అయిన రీకౌంటింగ్ మంత్రి చిదంబరం, మేధావి జై రామ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ దన్నుతో విభజన బిల్లు ముసుగులో చేసిన ప్రజాస్వామ్య విధ్వంసం ఇంతా అంతా కాదు. వీరు ఇద్దరికీ తోడు ఇటలీ నుండి దిగుమతి అయిన అమ్మ వారి తీరు, మౌన ప్రధాని, ఊహాలొకాలలొ విహరిస్తున్న యువరాజు, పార్లమెంటులో సాటి ఎంపి లను మార్షల్స్ గా వినియోగించిన కమల్ నాథ్, రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి తీరు చూస్తుంటే ఈ దేశాన్ని ఇక దేవుడే కాపాడాలి అని ప్రజలు భావించడం లో తప్పు లేదు. పెప్పర్ స్ప్రే ఉదంతం లో "సీమాంధ్ర ఎంపిలు చంపేందుకు ప్రయత్నించారు. కఠిన చర్యలు తీసుకుంటాం. హత్యాయత్నం కేసు పెడతాం'' అని షిండే, కమల్‌నాథ్ ప్రకటించారు, ఇప్పుడు విభజన బిల్లు చర్చ సందర్భం గా పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పాతరవేసినందుకు ఎవరిమీద హత్యా కేసులు పెట్టాలో షిండే, కమల్‌నాథ్ చెబితే బాగుంటుంది. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు, ఇంకా రాజ్య సభ విభజన బిల్లు ను ఆమోదించవలసి ఉంది. రాజ్య సభ ఒక్క సవరణ చేసినా విభజన బిల్లు మళ్లీ లోక్ సభ కు వెళ్ళవలసి ఉంటుంది. ఈ లోపు సుప్రీమ్ కోర్టు సూచించిన "తగిన సమయం" కనుక వస్తే, కోర్టు విభజన బిల్లు కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటీషన్లు విచారణ కు స్వీకరించి "స్టే" ఇవ్వగల అవకాశం ఉంది. మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అయినటువంటి ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ పట్టించిన దుర్గతి ని చూసి రేపు మా గతి ఏమిటని వారి వారి రాజధానులకు దూరం గా నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు భీతి చెందే అవకాశం ఉంది. విభజన కు ఒక ప్రాతిపదిక లేకుండా ప్రత్యేక రాష్ట్ర కుంపట్లు దేశ వ్యాప్తం గా రాజుకుంటే అది దేశ పురోగతికి ఖచ్చితం గా అవరోధం అనడం లో సందేహం లేదు, కాబట్టి రాష్ట్ర విభజన విషయం లో కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 3 విషయం లో మాతృ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి విలువనిచ్చే రీతిలో సుప్రీమ్ కోర్ట్ తీర్పు వెలువరిస్తుంది అని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: