భర్తకు అదనపు కట్నం కావాలనే  ఆలోచన 13 ఏళ్ల దాంపత్య జీవితంలో చిచ్చుపెట్టింది. ఈ నేపథ్యంలో భార్యను తరచూ అదనపు కట్నం కావాలని వేధించేవాడు భర్త. తాగొచ్చి చేయి కూడా చేసుకునేవాడు. ఇక భర్త తీరుతూ ఎంతగానో మనస్తాపం చెందింది  భార్య. భర్త  చెప్పినట్లుగా అదనపు కట్నం అడిగి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏకంగా బలవన్మరణానికి పాల్పడింది. ఇలా భర్త అదనపు కట్నం వేధింపులు తాళలేక మనస్తాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో వెలుగులోకి వచ్చింది,



వివరాల్లోకి వెళితే... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మికి నల్గొండ జిల్లా వెలిమినేడు కు చెందిన పప్పు గోపాల్ తో 13 ఏళ్ళ  క్రితం వివాహం జరుగగా పెళ్లి సమయంలో ఐదు లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారం ఇచ్చారు ఆ మహిళ తల్లిదండ్రులు. అయితే కొన్ని రోజుల వరకూ వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. కానీ ఆ తర్వాత భర్త అసలు రూపం బయటపడింది . భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు గోపాల్. ఈ క్రమంలోనే 2012లో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ భర్తపై ఫిర్యాదు కూడా చేసింది భార్య.



ఇక పోలీసులు గోపాల్ ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ తన తీరు మార్చుకోలేదు గోపాల్. అదనపు కట్నం కావాలంటూ భార్యను చిత్రహింసలకు గురి చేస్తూనే ఉన్నారు. ఇక కూతురి బాధను చూసి తల్లడిల్లి పోయిన  తల్లిదండ్రులు లక్ష రూపాయల నగదు, 4 తులాల బంగారం అదనపు కట్నంగా అల్లుడికి ముట్ట చెప్పారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల వరకు సైలెంట్గా ఉన్న గోపాల్ మళ్లీ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల భార్య  ధనలక్ష్మిపై చేయి చేసుకున్నాడు. అయితే  మరోసారి తల్లిదండ్రులను అదనపు కట్నం పేరుతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ మహిళ మనస్థాపం చెంది.. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: