ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల ఆకర్షణ... ఉపాధి కల్పన.. నైపుణ్యాభివృద్ధిలో స్థానిక ప్రజల సాధికారత... వంటి అంశాలతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది.  

తెలంగాణ యువతకు కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త పాలసీ రూపొందించింది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో... స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రూపొందిన ఈ నూతన విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్‌ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చిన ప్రభుత్వం‌... రాష్ట్రానికి భారీగా పరిశ్రమలను రప్పించడంలో సక్సెస్‌ అయ్యింది. అయితే ఆ పరిశ్రమల్లో ... తెలంగాణ యువతకే ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే సీఎం కేసీఆర్‌ పరిశ్రమలశాఖను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమలశాఖ.. ఒక ముసాయిదా తయారు చేయగా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కూడా నిర్ణయించింది.

రాష్ట్రంలో నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను.. ప్రభుత్వ పారిశ్రామిక, విద్యాసంస్థల పరస్పర సహకారంతో అందించాలని కేబినెట్‌ సూచించింది.  మహారాష్ట్ర లో పర్యవేక్షక సిబ్బందిలో 50%, మొత్తం ఉద్యోగులలో 80%, కర్ణాటక లో 75% ఆంధప్రదేశ్‌ 75%, మధ్యప్రదేశ్‌ లో 70% స్థానికులకు కచ్చితంగా ఉపాధిని కల్పిస్తేనే రాయితీలను అందించే నిబంధనను వర్తింపజేస్తుండగా.. ఇప్పుడు తెలంగాణ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. దీనికోసం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని కేబినెట్ నిర్ణయించింది. టాస్క్‌ వంటి సంస్థల ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతను కల్పించాలని , నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ముఖ్యమైన పరిశ్రమలను  ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలతో అనుసంధానం చేయాలని సూచించింది. దీని కోసం రాయితీలను రెండుగా విభజించింది.

ప్రత్యేకంగా తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ వంటి సంస్థల ద్వారా తెలంగాణ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి స్థానికులకే 70 శాతం ఉద్యోగాలివ్వాలనే చట్టం చేయడం.. రాజ్యాంగ విరుద్ధమనే వాదన ఉంది. ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలు చేశాయి. ఇది రాజ్యాంగంలోని 16వ అధికరణను ఉల్లంఘించడమేనన్న విమర్శలున్నాయి. అందుకే... దీన్ని చట్టంలా కాకుండా.. జాబ్స్ పాలసీగా రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం‌. సాధారణంగా పరిశ్రమలకు స్కిల్డ్ లేబర్ కీలకం. వారు ఎక్కడ ఉంటే.. అక్కడకే పరిశ్రమలు వెళ్తాయి. ఇప్పుడు స్థానికులకే ఉద్యోగాలనే నిబంధన పెట్టిన రాష్ట్రాల కన్నా.. హైదరాబాద్ వైపే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: