తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా పండించే పంటలలో ఉల్లి ఒకటి. గతేడాది ఇదే సమయంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లి పంట వేసిన రైతులు లక్షాధికారులు అయ్యారు. ఒక దశలో కిలో ఉల్లి 200 రూపాయలకు చేరిందంటే ఉల్లికి ఏ స్థాయిలో డిమాండ్ పెరిగిందో సులభంగా అర్థమవుతుంది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల నుంచి ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది రైతులకు భారీ లాభాలు రాగా ఈ సంవత్సరం మాత్రం నష్టాలు తప్పడం లేదు.
 
అయితే తెలుగు రాష్ట్రాల రైతులు మరో విధంగా కూడా మోసపోతూ ఉండటం గమనార్హం. ఈ సంవత్సరం ఉల్లి రైతులకు కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని మలక్ పేట్ మార్కెట్ కు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి పంట దిగుమతి అవుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ఉల్లి దిగుమతి అవుతుండగా రాయలసీమలోని కర్నూలు జిల్లా నుంచి, తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి ఉల్లి పంట మార్కెట్ కు చేరుకుంటోంది.
 
అయితే హైదరాబాద్ మార్కెట్ లో తెలుగు రాష్ట్రాల ఉల్లి తక్కువ ధర పలుకుతుండటం గమనార్హం. ఏపీ, తెలంగాణకు చెందిన ఉల్లి క్వింటాల్ 300 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పలుకుతుండగా మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన పాత ఉల్లి మాత్రం 1000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పలుకుతోంది. వ్యాపారులను తెలుగు రాష్ట్రాల రైతులు ధరలో వ్యత్యాసం గురించి ప్రశ్నిస్తే కొత్త ఉల్లి త్వరగా కుళ్లిపోతుందని సమాధానం వినిపిస్తోంది.
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల కూడా ఉల్లి నాణ్యత దెబ్బ తింటోందని తెలుస్తోంది. దీంతో ఉల్లిని నమ్ముకుని మరోసారి మునిగిపోయామంటూ రైతులు బాధ పడాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వేల రూపాయలే రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: