ప్రతిపక్షం గా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకు రావటం అనేది అత్యంత కష్టం. అది సాధారణమైన విషయం కాదు. ప్రజల్లో వ్యతిరేకత కలగడం అనేది కూడా అంత ఈజీ కాదు. ప్రజలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది చెప్పటం చాలా వరకు రాజకీయ పరిశీలకులు కూడా కష్టంగానే ఉంటుంది. ప్రజల్లో తిరిగే నాయకులు కూడా ప్రజలను అర్థం చేసుకోవడంలో చాలా వరకు విఫలమవుతుంటారు. ఇదే చాలా మంది నేతలు ఓటమికి కారణం అవుతూ ఉంటుంది. కానీ ప్రజల ఏది ఆలోచిస్తున్నారు అనే దాన్ని పట్టే అరుదైన నేతలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒకరు.

2004 కు ముందు చంద్రబాబు నాయుడు పై చాలా వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ బ్యాంకు కి అనుకూలంగా జరుగుతున్న పనులు వంటివి వైయస్ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. అప్పటి వరకు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళవచ్చు అనే ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ వైఎస్ మాత్రం తెలుగుదేశం పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని అప్పుడు పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను అదే విధంగా ఆర్ధికంగా ప్రజలు పడుతున్న కష్టాలను... ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పాదయాత్ర చేశారు.

దాదాపు 1400 కిలోమీటర్ల మేర ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజలతో నేరుగా మాట్లాడటమే కాకుండా వారి కష్టాల్లో మమేకమయ్యారు. ఆ యాత్ర వైఎస్ రాజకీయ జీవితాన్ని మార్చేసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ యాత్రకు వచ్చిన స్పందన చూసి కంగారు పడింది. దేశంలో ఏ కాంగ్రెస్ నేత కూడా తన పార్టీ కోసం ఈ స్థాయిలో కష్టపడిన సందర్భం కాంగ్రెస్ కూడా చూడలేదు. అందుకే కాంగ్రెస్ చరిత్రలో అరుదైన నేతల్లో వైఎస్ కూడా ఒకరు అని చెప్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: