పంజాబ్‌లో అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌పై దాడి కలకలం రేపుతోంది. జలలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు  నామినేషన్‌ దాఖలు సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. అకాలీదళ్‌ నేతలు.. కాంగ్రెస్‌ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ గొడవలో సుఖ్‌బీర్‌సింగ్‌ వాహనం చిక్కుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్ల దాడి, తుపాకీ తూటాల నుంచి తృటిలో తప్పించుకున్నారు అకాలీదళ్‌ అధినేత.

పంజాబ్‌లో అకాలీదళ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. జలలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడులకు దిగారు. అయితే ఈ ఘర్షణలో అకాలీ పార్టీ అధినేత సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ వాహనం చిక్కుకుంది. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసం కాగా.. సుఖ్‌బీర్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఇది కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేసిన దాడి అంటూ మండిపడ్డారు.

ఈ ఘటనలో తుపాకీ కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ముగ్గురు అకాలీదళ్‌ నేతలకు బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. రాళ్ల దాడిలో ఆరుగురు గాయపడ్డారు. ఓ కాంగ్రెస్‌ కార్యకర్తకు కూడా బుల్లెట్‌ గాయమైంది. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదలే ఉద్రిక్తతలకు కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. నామినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతున్న సమయంలో సుఖ్‌బీర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను రెచ్చగొట్టారని విమర్శిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

జలలాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఇక్కడ అకాలీదళ్‌ ఓడిపోయింది. దీంతో సుఖ్‌బీర్‌ సింగ్‌ నామినేషన్‌లో సత్తా చాటేందుకు భారీగా అనుచరగణంతో వచ్చారు. అటు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా చేరుకోవడంతో రాళ్ల దాడికి దారి తీసింది. అయితే ఈ ఘటనలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అకాలీ నేతలే తుపాకులతో ఫైరింగ్ చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే.. లేదు కాంగ్రెస్‌  నేతలేనంటున్నాయి శిరోమణి శ్రేణులు. మొత్తానికి ప్రముఖ నేత వాహనంపై దాడి జరుగడంతో అక్కడి ప్రభుత్వం అలర్టయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: