అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేయలేం.. తర్వాత తర్వాత ఏమైనా జరగొచ్చు కానీ.. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే మాత్రం  కంగారూలే కప్పు ఎగరేసుకుపోయేలా ఉన్నారు. ప్రపంచకప్ ఫైనల్లో కంగారూలకు అంత మంచి ఆరంభం లభించింది మరి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 15 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు మాత్రమే చేసింది.

సెమీస్ వరకు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ డకౌటై ఆ దేశ అభిమానుల్నే కాదు.. కివీస్ గెలవాలని ఆశిస్తున్న భారత అభిమానుల్ని కూడా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఆరంభంలో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లను బెదరగొట్టేసి.. జట్టుకు అద్భుత ఆరంభాలివ్వడం బ్రెండన్ శైలి. ఐతే ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ తొలి ఓవర్లోనే మెక్‌కలమ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి కివీస్ ఆశలపై పెద్ద దెబ్బ కొట్టాడు.

బ్రెండన్ ఔటవడంతో న్యూజిలాండ్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ జట్టు ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. దీనికి తోడు క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన గప్తిల్ కూడా 15 పరుగులకే మాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. నిలకడకు మారుపేరైన విలియమ్సన్ కూ 12 పరుగుల వద్ద ఔటయ్యాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్, సెమీఫైనల్ హీరో ఇలియట్ క్రీజులో ఉన్నారు.

ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న మెల్‌బోర్న్ మైదానంలో టోర్నీలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 300కు పైగా స్కోర్లు చేశాయి. కానీ న్యూజిలాండ్ 200 చేసిన గొప్పే అన్నట్లుంది పరిస్థితి. ఆ జట్టు పుంజుకుని 250కి పైగా స్కోరు చేస్తే తప్ప కప్పుపై ఆశలు పెట్టుకోలేదు. ఇప్పటికే నాలుగుసార్లు కప్పు గెలిచిన కంగారూలు.. మరో కప్పుకు చేరువవుతున్నట్లే ఉంది పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: