ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి బుధవారం నాడు.. మతసామరస్యానికి అచ్చమైన ప్రతీక లాగా నిలిచారు. అత్యంత వైభవోపేతంగా జరిగే అఖండగోదావరి పుణ్య పుష్కరాల్లో జగన్‌ స్వయంగా పాల్గొన్నారు. తాను పాటించే మతవిశ్వాసాలకు సంబంధించిన క్రతువులు కాకపోయినప్పటికీ.. చాలా శ్రద్ధగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మశాంతికి నివాళులర్పించి, పిండప్రదానాలు చేసి... హిందూ శాస్త్రోక్తంగా అపరకర్మలను పూర్తి కావించారు. గోదావరి స్నానాలు చేశారు. 


వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మత విశ్వాసాల పరంగా కేథలిక్‌ క్రిస్టియన్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన వ్యక్తిగతంగా అన్నీ ఆ సాంప్రదాయాలే పాటిస్తారు. అయితే చిన్నతనం నుంచి రాజకీయ కుటుంబం కావడం వలన.. అబ్బిన సంస్కారాల కొద్దీ.. అన్ని మతాల పట్ల సమానమైన ఆదరణను కలిగి ఉంటారు. ఏ పుణ్యక్షేత్రాలను సందర్శించినా.. అక్కడి దేవాలయాలనుకూడా సందర్శించడం, మసీదుల్లో ప్రార్ధనలు నిర్వహించడం అన్నీ చేస్తుంటారు. అలాగే.. వైఎస్‌ జగన్‌.. తన తండ్రి మరణానంతరం, తానే ఒక రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత వచ్చిన తొలిపుష్కరాల సందర్భంగా కూడా పూర్తిస్థాయిలో హిందూ సాంప్రదాయాలు, శాస్త్ర నియమానుసారంగా.. తన తండ్రి రాజశేఖరరెడ్డికి అపరకర్మలు నిర్వహించారు. 


బుధవారం గోదావరి పుణ్యస్నానాలు చేసిన జగన్‌ ఒకవైపు మెడలో శిలువ గుర్తున్న గొలుసును ధరించి, మరోవైపు శాస్త్రోక్తంగా పిండప్రదానాలు చేయడం, గోదావరిలో మునకలు వేయడం.. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అందుకే ఈ గెటప్‌ లో జగన్‌ను చూసిన వారు ఆయన అచ్చంగా మత సామరస్యానికి ప్రతీకగా కనిపిస్తున్నారని అనుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: