రాజ‌కీయాల్లో ఎక్క‌డ ఎలాంటి వ్యూహం వేయాలో బీజేపీ నేత‌ల‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఏపీకి ప్ర‌త్యేక హోదా లేద‌న్న నోటితోనే పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ నేత‌లు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఇదే విష‌యాన్ని మేనిఫెస్టోలోనూ పెట్టారు. ఇప్పుడు త‌మిళుల‌ను ఆక‌ర్షించేందుకు కూడా ఇలాంటి వ్యూహ‌మే వేశారు. సీనియ‌ర్ న‌టుడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎప్పుడో గుర్తించిన త‌లైవా ర‌జ‌నీ కాంత్‌కు.. దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం ప్ర‌క‌టించారు. ఇది పూర్తిగా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ పెద్ద‌లు వేసిన పాచిక‌గానే రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 వాస్త‌వానికి ర‌జ‌నీకి దాదా అవార్డు ఎప్పుడో రావాల‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ఈ పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డం వెనుక వేరే రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ర‌జ‌నీకి బీజేపీ ప్ర‌భుత్వం ఈ పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.  ఇన్నేళ్ల‌లో ఆయ‌న‌ను ప‌ట్టించుకోని బీజేపీ పెద్ద‌లు.. ఇప్పుడు ఏకంగా ఆయ‌న‌కు దాదాసాహెబ్ ఫాల్కే వంటి అత్యున్న‌త పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు.  ర‌జ‌నీ అభిమానుల‌ను, త‌మిళుల‌ను సైతం త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగానే ఇలా పుర‌స్కారం ప్ర‌క‌టించింద‌నే వాద‌న వినిపిస్తోంది.

అయితే.. త‌మిళ‌నాడులో బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. ఇప్పుడు త‌లైవాను న‌మ్ముకుని, ఆయ‌న‌ను పోటీ నుంచి కూడా ప‌క్క‌కు త‌ప్పుకొనేలా ఏకంగా రాజ‌కీయాల నుంచి విర‌మించుకునేలా చేశార‌నే వాద‌న కూడా ఉంది. అందుకే పార్టీ పెడ‌తాన‌ని ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఊగిస‌లాడిన ర‌జ‌నీ చివ‌ర‌కు ఈ వ‌య‌స్సులో త‌న‌కు రాజ‌కీయాలు వ‌ద్ద‌నుకుని పార్టీ పెట్టే ఆలోచ‌న విర‌మించుకున్నాన‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్ర‌క‌టించిన దాదా అవార్డు.. బీజేపీకి ఓట్లు వ‌చ్చేలా చేస్తుందా ?  కేంద్రంపై ఇప్ప‌టికే మంటెత్తిపోతున్న త‌మిళ తంబిలు ప్ర‌స‌న్నం అవుతారా? అంటే.. కార‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అన్ని విష‌యాలు త‌మిళుల‌కు తెలుసున‌ని.. ఇత‌ర రాష్ట్రాల మాదిరిగా వారు జిమ్మిక్కుల‌కు లొంగి పోర‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ వేసిన పాచిక పారే అవ‌కాశం లేద‌ని ఓ వ‌ర్గం చెబుతుండ‌గా.. కొంత మేర‌కు వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: