ఇక తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలు ముగిసిపోయిన తరువాత రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకరేమో గెలుపు మనదేనంటూ అనేక చోట్ల నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు.. అంతేగాక పోలింగ్‌ నాటికి పార్టీ ప్రభావమే లేకుండా చేశారు. మరొకరు ప్రచారం తారా స్థాయికి వెళ్లాక పార్టీ పరువు తీశారు. ఆ ఇద్దరు.. బీజేపీ, టీడీపీల రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, అచ్చెన్నాయుడు. ఈ ఇద్దరికీ పదవీగండం పొంచి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. షెడ్యూల్‌ ప్రకటించక ముందు నుంచే బీజేపీ ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ విస్తృత సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం జరిగింది.


దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత దేశం మొత్తం మోడీ వైపే చూస్తోందని, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరతామని చెప్పారు. తీరా షెడ్యూల్‌ వచ్చిన తరువాత స్థానిక నేతల్ని కాదని కర్ణాటక చీఫ్‌ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. దుబ్బాక ఫలితం, జనసేన మద్దతు కలిసివస్తాయని నేతలు భావించారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు టీటీడీ కేంద్రంగా అనేక వివాదాలు సృష్టించారు. హిందుత్వం ఆధారంగా రాజకీయంగా లబ్ధిపొందాలని అనేక ఎత్తుగడలు వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి తీసుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత వాస్తవికతను గ్రహించిన ఆయన పార్టీ రాష్ట్ర నేతలపై కోప్పడినట్లు సమాచారం అందుతుంది. క్షేత్రస్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయకుండానే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు? ఏవిధంగా గెలుస్తామంటున్నారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డట్లు తెలిసింది. ఏపీ బీజేపీ నేతలకు బాధ్యత లేదని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల తరువాత వీర్రాజుకు పదవీగండం ఉందనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: