హరీష్ రావు... తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేత ఎవరూ అంటే... ఠక్కున గుర్తుకు వచ్చే పేరు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా మారిన వ్యక్తి కూడా. అటు అసెంబ్లీలో.. ఇటు బయట కూడా ఎంతో యాక్టివ్ గా వ్యవహరించారు హరీష్ రావు. ఇక ఉద్యమ సమయంలో అయితే ఆయనపై నమోదు కాని కేసు అంటూ లేదు. అటు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉద్యోగిపై దాడి చేసిన విషయం అప్పట్లో పెను దుమారమే రేపింది. ఇక అసెంబ్లీలో బడ్జెట్ పేపర్లు చింపేసి నేరుగా గవర్నర్ నరసింహన్ పైనే విసిరేసి.. ఆయన చేసి యాగిపై పత్రికరు పతాక శీర్షికలతో ప్రచురించాయి కూడా.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ సర్కార్ కొలువైంది. అంతా ఊహించినట్లుగానే పార్టీలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావుకు కీలక పదవి దక్కింది. 2014 ప్రభుత్వంలో కీలకమైన జల వనరుల శాఖను నిర్వహించారు. ఆయన హాయంలోనే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బాద్యత కూడా హరీష్ రావు స్వయంగా తీసుకున్నారు.

అయితే ప్రస్తుతం హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిందా అంటే.. అవుననే అనిపిస్తోంది. 2018లో తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్... మంత్రివర్గం ఏర్పాటులో తీవ్ర జాప్యం చేసింది. సీఎం, హోమ్ మినిస్టర్ పదవులతోనే దాదాపు 3 నెలలు నెట్టుకొచ్చింది. హరీష్ కు మంత్రిపదవి ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదేమో అనే పుకారు షికారు కూడా చేసింది అప్పట్లో. వాటిని పటాపంచలు చేస్తూ... కీలకమైన ఆర్థిక శాఖను హరీష్ కు కేటాయించారు కేసీఆర్. కానీ పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో గతేడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పూర్తి బాధ్యతను హారీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. ప్రచారం నుంచి కౌంటింగ్ వరకు కేసీఆర్, కేటీఆర్ సహా కీలక నేతలెవ్వరూ దుబ్బాక వైపు కన్నెత్తి చూడలేదు కూడా. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. కానీ గులాబీ పార్టీ అభ్యర్థిని హరీష్ రావు గెలిపించలేకపోయారనే అపవాదు వచ్చింది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను కూడా హరీష్ రావుకే అప్పగించారు కేసీఆర్. అభ్యర్థిగా శ్రీనివాస యాదవ్ ను ప్రకటించిన వెంటనే... నియోజకవర్గంలో హరీష్ రావు బైక్ ర్యాలీ నిర్వహించారు కూడా. హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే మాత్రం... హరీష్ మరోసారి టార్గెట్ గా మారటం ఖాయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: