ఎట్టకేలకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు జరిగిన చర్చలు ఫలించాయి. రేపు అర్థరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన సమ్మెను ఉద్యోగ సంఘాలు విరమిస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో హెచ్ ఆర్ ఏ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.


ప్రభుత్వం తో కుదిరిన ఒప్పందాన్ని టీచర్లు వ్యతిరేకిస్తున్నారు. టీచర్ల సంఘాల ప్రతినిధులతో చర్చించకుండానే సమ్మె విరమణ ప్రకటన చేశారని టీచర్ల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు బండి, బొప్పరాజు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని టీచర్ల సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఉపాధ్యాయ జేఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది.


పాత తాలూకా కేంద్రాల్లోఉదయం 9 గంటలకు బండి, బొప్పరాజు, వెంకట్ రామ్ రెడ్డి, మరియు ఇతర పిఆర్సీ సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మల దహనం చేయాలని నిర్ణయించారు. సామూహిక నిరసన దీక్షలు మరియు సమ్మె కొనసాగింపుపై అంగీకార పత్రాలు సేకరణ నిర్వహిస్తారు. సోమవారం విజయవాడలో పీఆర్సీ సాధన సమితి నాయకుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఉంటుంది. ప్రధాన డిమాండ్ల పై చర్చ జరగలేదు కాబట్టి సాధన సమితి నాయకుల రాజీనామా కోసం డిమాండ్
చేయనున్నారు.


ఉద్యోగ సంఘాల నేతలు టీచర్లను వెన్నుపోటు పొడిచారని టీచర్ల సంఘాల నేతలు అంటున్నారు. ఉద్యమం వంటి విషయాల్లో యాక్టివ్‌గా ఉండే టీచర్ల నేతలు దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తమను వెన్నుపోటు పొడిచారని వారు మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కలసి కట్టుగా పోరాడతామన్నది జగన్ కోసం అంటూ మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఈ టీచర్ల ఆందోళన ఎటు దారి తీస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: