మొన్నటికి మొన్న విజయవాడలో బ్రహ్మాండమైన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించినా.. ఉద్యోగ సంఘ నాయకులు పెద్దగా సాధించిందేమీ లేకపోయింది. ఫిట్ మెంట్‌ పెరగలేదు. కాస్త హెచ్‌ఆర్‌ఏ స్లాబులు పెంచుకోవడం మినహా ఏమీ ఫాయిదా లేకపోయింది. హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై విపరీతమైన ఆగ్రహంగా ఉన్న టీచర్లు.. సమ్మె విరమణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా ఉద్యమం కొనసాగించాలని భావిస్తున్నారు.


జగన్ సర్కారుపై సమర శంఖం పూరించిన టీచర్లు.. ఇప్పుడు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు, సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వంతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారని భావిస్తున్న టీచర్లు.. వారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


ఇంకొందరైతే.. ఏకంగా వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాదు.. శివాజీ సినిమాలో స్థానిక నాయకులను రజినీకాంత్ డీల్ చేసిన సీన్లతో మీమ్స్ చేస్తూ పేరడీలు చేస్తున్నారు. ఈ నలుగురు ఉద్యోగ సంఘాల నేతలు.. జగన్‌కు కొత్త సలహాదార్లుగా మారారని ట్రోల్ చేస్తున్నారు. ఇలా తమ క్రియేటివిటీని ఉపయోగించి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు టీచర్లు. టీచర్ల వాట్సప్‌ గ్రూపుల్లోనూ.. సోషల్ మీడియా వేదికలపైనా ఈ నలుగురిని బాగా ఆడేసుకుంటున్నారు.


ఇలా మొత్తం మీద ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె యోచన విరమించినా.. తాము తగ్గేదేలేదంటున్నారు. ఇప్పటికే ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్ సంఘం.. ఫ్యాప్టో తమ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. ఉపాధ్యాయులంతా ఇవాళ్టి నుంచి వారం రోజులు నల్ల బ్యాడ్జస్ ధరించి విధులకు వస్తారట. 11 న కలక్టర్ లకు వినతిపత్రాలు ఇస్తారట. 12న రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తారట. పీఆర్సీని రద్దు చేయాలని, అశుతోష్ కమిటీ రిపోర్ట్ బయటపెట్టాలని ఫ్యాప్టో మొదటి నుంచి పోరాడింది. జనవరి 17 నుంచే జీవోల వల్ల  ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్స్ కి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: