రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతోంది. అసలు ఈ యుద్ధంలో ఎవరిది పైచేయి అయ్యింది. అపరిమితమైన సైనిక శక్తి గల రష్యాకు ఉక్రెయిన్ ఎందుకు చిక్కడం లేదు. ఉక్రెయిన్‌ను హస్త గతం చేసుకోవడం రష్యా సైన్యానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది. అసలు ఉక్రెయిన్లో ఏం జరుగుతోంది.. యుద్ధం జరుగుతున్న తీరు తెన్నులేంటి.. ఇప్పుడు ఈ అంశాలపై ప్రముఖ దిన పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనం వెలువరించింది.


ఈ కథనం ప్రకారం.. అసలు ఉక్రెయిన్‌ పై పోరాడం చాలా మంది సైనికులకు ఇష్టం లేదట. అందుకే.. పాపం.. వారు ఉక్రెయిన్‌ ప్రజలపై బాంబులు వేయలేక చాలా మంది రష్యన్‌ సైనికులు కంట నీరు పెట్టుకున్నారట. యుద్ధం చేయడం ఇష్టం లేక.. వారు ఏకంగా తమ సొంత వాహనాలనే తగులబెడుతున్నారట. ఎందుకంటే.. రష్యా సైనికుల్లో చాలామంది యువకులే.. వీరికి సరైన మిలటరీ ట్రైనింగ్ కూడా లేదట. వీరు ఉక్రెయిన్‌తో పోరాటానికి పూర్తిస్థాయిలో సిద్దంగా లేరట కూడా.


అంతే కాదు.. రష్యా సైనికులకు అవసరమైన ఆహారం కూడా లేదట. వారి సైనిక వాహనాలకు సరిపడా ఇంధనం కూడా సైన్యం వద్ద లేదట. తమ సొంత వాహనాలనే తగులబెడుతున్నామని  ఉక్రెయిన్‌కు చిక్కిన రష్యన్‌ సైనికులు చెబుతున్నారట. ఇది ఉక్రెయిన్‌ కు చిక్కిన రష్యా సైనికుల వాదనే కాదు..  బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ షాడో బ్రేక్‌ కూడా ఇలాగే చెబుతోంది.


తాజాగా యుద్ధం తీరుపై ఓ నివేదిక ఇచ్చిన బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ.. న్యూయార్క్ టైమ్స్ కథనంలోని అంశాలను బలపరుస్తోందట. ఈ మేరకు ఓ రేడియో మేసేజ్ పంపిందటడ. ఉక్రెయిన్‌ పట్టణాలుపై బాంబులు విసరాలన్న రష్యా కమాండర్ల ఆదేశాలను యుద్ధ క్షేత్రంలోని రష్యన్‌ సైనికులు ధిక్కరిస్తున్నారట. అయితే ఈ కథనాలన్నీ అమెరికా, బ్రిటన్‌ మీడియాలు వండి వార్చినవే.. అందువల్ల వీటిని నమ్మడం కష్టం అంటున్నారు యుద్ధ నిపుణులు. రష్యా సైన్యంపై వెస్ట్రన్ మీడియా చేస్తున్న యుద్ధంగా దీన్ని వర్ణిస్తున్నారు. మరి అసలు యుద్ధ రంగంలో ఏం జరుగుతుందన్నది స్పష్టంగా చెప్పడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: