ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు సహా.. ఇతరత్రా అనేక కారణాలతో ప్రతిపక్షాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టింది. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటంతో నారా లోకేష్ వాటికి నాయకత్వం వహించారు. కరెంటు చార్జీల పెంపుపై కూడా ఆ పార్టీ నాయకులు రోడ్లపై నిరసనలు తెలిపారు. ఇక బీజేపీ విషయంలో కూడా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కీలక నాయకులంతా రోడ్లపైకి వచ్చారు. మరి పవన్ కల్యాణ్ ఎందుకు మిస్సయ్యారు..? పవన్ ఆందోళన కార్యక్రమాలకు ఎందుకు నాయకత్వం వహించడంలేదు..? ఇలా చేస్తే కేడర్ కి ఏం మెసేజ్ ఇచ్చినట్టు..?

పవన్ కల్యాణ్ పై ఇప్పటికే సీజనల్ పొలిటీషియన్ అనే ముద్రపడిపోయింది. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ భావించినా.. జనసైనికులకు మాత్రం సరైన సమయంలో సరైన దిశా నిర్దేశం చేసే నాయకుడు కావాల్సిందే. భారం అంతా నాదెండ్లపై వదిలేసి, పవన్ కేవలం ప్రెస్ నోట్లతో సరిపెడతానంటే కుదరదు. ఆయన కూడా రాజకీయ రణరంగంలోకి దిగాలి. నేరుగా ప్రభుత్వంపై పోరాడాలి. ఎక్కడో కూర్చుని స్టేట్ మెంట్లిస్తానంటే జనసైనికుల్లో ఆ ఉత్సాహం రాదు.

మిగతా పార్టీల నాయకులంతా జనంలో తిరగడానికి బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. వయోభారం ఉన్నా కూడా చంద్రబాబు ఎంతలా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. మరి పవన్ కల్యాణ్ ఇంకా సినిమాలు, షూటింగ్ లతో కాలక్షేపం చేస్తే ఎలా..? ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉంది. ఇప్పుడు కూడా జనంలోకి వచ్చి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనకపోతే ఓటు బ్యాంకు పెరుగుతుందా..? ముఖ్యంగా జనసైనికుల్లో ఉత్సాహం వస్తుందా..?

పవన్ ఇప్పటికైనా జనంలోకి రావాలని జనసైనికులు కోరుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాతయినా పవన్ నుంచి ఆ మార్పు ఉంటుందని ఆశించారంతా. కానీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత కూడా పవన్ అంత హుషారుగా జనంలోకి రాలేదు. దీంతో జనసైనికుల్లో కొంత అసంతృప్తి ఉందని అంటున్నారు. వచ్చే రెండేళ్లు పవన్ మరింత కష్టపడితే అసెంబ్లీలోకి ఎంట్రీ దొరుకుతుంది. ఇప్పుడు కూడా సినిమాలు, రాజకీయాలంటూ రెండు పడవలపై కాళ్లు వేస్తే మాత్రం కష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: