షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయముంది. ఈలోగా ఎన్ని వీలైతే అన్ని ఉపఎన్నికలు వచ్చేట్లు చేయాలి.  అందులో ఎన్నివీలుంటే అన్ని గెలవాలి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తాము అని జనాల మైండ్ సెట్లోకి చొప్పించాలి. ఇది తెలంగాణాలో బీజేపీ వ్యూహం. ఈ వ్యూహం ఢిల్లీలోని  బీజేపీ అగ్రనేతల నుండే హైదరాబాద్ కు అందింది. దీనికోసమే అహర్నిసలు తెలంగాణాలోని కమలనాదులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగమే ఇపుడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎపిసోడ్.





కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీకి ఎంఎల్ఏకి మధ్య ఉన్నది ఆర్ధికబంధమని తాజాగా బయటపడింది. ఛత్తీస్ ఘడ్ లో బొగ్గుగనుల కాంట్రాక్టు రాజగోపాల్ కు దక్కటం వెనుక బీజేపీతో గతంలో జరిగిన ఒప్పందమే కారణమని సమాచారం. అప్పట్లో జరిగిన ఒప్పందం ప్రకారమే రాజగోపాల్ కు బొగ్గుగనులు దక్కటం, ఎంఎల్ఏ బీజేపీలో చేరటమట. ఒకసారి గనులు దక్కించుకున్న తర్వాత ఇపుడు బీజేపీలో చేరనని చెబితే ఏమవుతుందో ఎంఎల్ఏకి బాగాతెలుసు.





ఆల్రెడీ చేరాలనేది డిసైడ్ అయిపోయింది కాకపోతే మద్దతుదారులతో సమావేశాలని, కాంగ్రెస్ నేతల బుజ్జగింపులనేవి  ఉత్త డ్రామాగా అర్ధమైపోతోంది. రాజగోపాల్ బీజేపీలో చేరగానే రాజీనామా చేస్తారు. తొందరలోనే మునుగోడులో ఉపఎన్నిక జరుగుతుంది. అందులో బీజేపీ తరపున రాజగోపాల్ పోటీచేసి గెలవాలనేది తెరవెనుక జరిగిన ప్లాన్. ఇలాగే మరికొందరు ఎంఎల్ఏలను బీజేపీలోకి లాగేసుకోవాలని ప్లాన్ జరుగుతోంది. వాళ్ళలో టీఆర్ఎస్ ఎంఎల్ఏలు కూడా ఉన్నారట. షెడ్యూల్ ఎన్నికల్లోగా ముగ్గరు, నలుగురితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికల్లో గెలిపించుకుంటే కేసీయార్ మీద మానసికంగా గట్టి దెబ్బపడుతుంది.






హుజూరాబాద్ లో ఓటమినుండే ఇంకా కేసీయార్ తేరుకోలేదు. ఇలాంటివి మరో మూడు నాలుగింటిలో దెబ్బకొట్టాలనేది కమలనాదుల ప్లాన్. ఇందులో భాగంగానే బీజేపీ పావులు కదుపుతోంది. అంతా బాగానే ఉందికానీ ఉపఎన్నికలు జరిగినపుడల్లా బీజేపీనే గెలుస్తుందని గ్యారెంటీఏమిటి ? టీఆర్ఎస్,కాంగ్రెస్ ల్లో ఏదైనా గెలవచ్చుకదా ? ముందైతే ఉపఎన్నికలు వస్తే అప్పుడు చూడాలి మిగితా విషయాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: