ఎంతసేపు జనసేనతో తాము పొత్తులోనే ఉన్నామని, తమ కాపురం సజావుగానే సాగుతోందని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో చెప్పుకోవటమే. ఏరోజు బీజేపీ తమ మిత్రపక్షమే అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒక్కసారి కూడా చెప్పలేదు. గురువారం వీర్రాజు మీడియాతో మాట్లాడుతు జనసేనతో  తమ కాపురం సజావుగానే సాగుతోందన్నారు. రాబోయే ఎంఎల్సీ ఎన్నికల్లో జనసేన ఓట్లన్నీ తమ అభ్యర్ధులకే పడతాయని వీర్రాజు చాలా నమ్మకంగా చెప్పారు.





ఇక్కడే బీజేపీ-జనసేన కాపురంపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే తొందరలోనే జరగబోయే టీచర్స్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేయమని పవన్ పిలుపిచ్చారు. అంతేకానీ తమ మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపించమని ఒక్కసారి కూడా అడగలేదు. మిత్రపక్షం అభ్యర్ధుల తరపున ప్రచారం చేయలేదు. మామూలు ఓటర్లు, పవన్ అభిమానుల సంగతిని పక్కనపెట్టేద్దాం కనీసం పార్టీ నేతలైనా బీజేపీకి ఓట్లేస్తారా ?





బీజేపీకి ఓట్లేసి గెలిపించమని తమ అధినేత పవన్ చెప్పకుండా పార్టీ నేతలు మాత్రం కమలానికి ఎలా ఓట్లు ఎలావేస్తారు ? ఇదే సమయంలో జనసేన ఓట్లను వేయించుకునేందుకు టీడీపీ, వామపక్షాల నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు పోటీచేస్తున్న టీడీపీ, వామపక్షాల అభ్యర్ధులకు రెండుపార్టీలు కుండమార్పిడి పద్దతిలో ఓట్లేసుకోవాలని డిసైడ్ అయ్యాయి. తమ రెండుపార్టీల ఓట్లు ఒకళ్ళవి మరొకళ్ళకి పడినంత మాత్రాన గెలుపు సాధ్యంకాదని నేతలకు అనుమానం వచ్చినట్లుంది.





అందుకనే జనసేన ఓట్లు కూడా వేయించుకోవాలని టీడీపీ, వామపక్షాల నేతలు అనుకున్నారు. బహుశా ఈ పాటికే పవన్ లేదా నాదెండ్ల మనోహర్ తో ఫోన్లో మాట్లాడే ఉంటారనటంలో సందేహంలేదు. ఒకవైపు టీడీపీ, వామపక్షాల నేతలు పవన్ కు గాలమేస్తుంటే  బీజేపీ ఏమి చేస్తున్నట్లు ? జనసేన ఓట్లకోసం వీర్రాజు ఇప్పటికే పవన్ తో భేటీ అయ్యారా ? కనీసం ఫోన్లో అయినా మాట్లాడారా ? రెండింటిలో ఏది జరిగినా పవన్ నుండి ఏదో ఒక రెస్పాన్స్ తెలియాలి కదా. అలాంటిదేమీ కనబడలేదంటే ఎంఎల్సీ  ఎన్నికల్లో బీజేపీని పవనే ముంచేయబోతున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: