ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్ చేశారు..వైసీపీ మంత్రి కొడాలి నాని. అంటే ఇదేదో నెగిటివ్ కామెంట్ అనుకోకండి.. బీసీల పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని చెప్పేందుకే నాని అలా అన్నారు. సీఎం వైయస్ జగన్ బీసీలకు అక్కున చేర్చుకుంటున్నారని.. వారిని అన్నివిధాలుగా ఆదుకుంటున్నారని నాని అన్నారు.]
విజయవాడలో జరిగిన నాయీ బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని కొడాలి నాని గుర్తు చేశారు. షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని ప్రజా సంకల్ప పాదయాత్రలో వైయస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రూ. 10 వేలు ప్రకటించారని మంత్రి కొడాలి నాని చెప్పారు. అణగారిన వర్గాలు, పేదల కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టే వారికి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
నాయీ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారని, వారికి ఇచ్చిన హామీలను సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బీసీలకు అండగా నిలిచారని, తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని రవాణా, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.
సమస్యలు పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో బీసీలను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని వివరించారు. తమ సమస్యలు పరిష్కరించమని వెళ్లిన నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బెదిరించారని గుర్తుచేశారు. మత్స్యకారులను బెల్టుతో తోలు ఊడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబు కించపరిచేలా వ్యహరించారన్నారు. జగన్ మాత్రం బడుగు వర్గాల కష్టాలు తీర్చేందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారన్నారు.