ప్రయాణికులకు పాత టిక్కెట్లు కట్టబెట్టి  డబ్బులు వసూలు చేస్తున్న కండక్టర్ ఉదంతం గద్వాల  డిపో మేనేజర్ ఆకస్మిక తనిఖీ తో బట్టబయలైంది.  షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫారూఖ్ నగర్ మండలం మేళ్లచెరువు గ్రామానికి చెందిన ప్రైవేటు కలెక్టర్ కె శివకుమార్ విధులు నిర్వహిస్తున్నాడు.  అయితే బస్సును గద్వాల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి  షాద్ నగర్ లో  ఆకస్మికంగా తనిఖీ చేశారు.  టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్ శివ కుమార్ క్యాష్ బ్యాగ్ లో రూపాయలు 3143  ఉండాల్సి ఉండగా, రూపాయలు 4477 ఉన్నట్లు డిఎం గుర్తించారు.


 అదనంగా ఉన్న డబ్బుల గురించి కండక్టర్ ను  డిఎం ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా శివకుమార్  నీళ్లు నమిలాడు.  ప్రయాణికులకు టికెట్  ఇచ్చిన తరువాత  వారు బస్సు దిగి వెళ్లేటప్పుడు వారి వద్ద నుంచి  తిరిగి కండక్టర్ టికెట్లను సేకరించి తన వద్ద ఉంచుకుని నట్లు  డిఎం గుర్తించారు . తిరిగి పాత టికెట్లను  అనేక మంది  ప్రయాణికులకు కట్టబెట్టి శివకుమార్ డబ్బులు వసూలు చేశాడని  ఆయన తెలిపారు .  ఈ మేరకు శివకుమార్ పై చర్యలు తీసుకోవాలని షాద్ నగర్  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మురళీధర్ రెడ్డి  వివరించారు . శివకుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు షాద్ నగర్ పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు .


 ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన అనంతరం తాత్కాలిక కండక్టర్లు ప్రయాణికుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి , టికెట్లు ఇవ్వకపోవడం , ఎక్కువ చార్జులు వసూలు చేయడం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి .   డబ్బులు వసూలు చేసి టికెట్లను ఇవ్వకపోవడం పట్ల పలువురు ప్రయాణికులు , తాత్కాలిక కండక్టర్లతో వాగ్వివాదానికి దిగిన సంఘటనలు లేకపోలేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: