తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. కానీ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. మామను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్నాడని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ ఏ కార్యక్రమంలోనైనా ఎన్టీఆర్ కు దండ వేసి మాట్లాడుతుంటారు. అయితే ఎన్టీఆర్ కు భారత రత్న ఇప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అంటున్నారు.

 

తెలుగు భాష కోసం స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తెలుగు భాషపై మమకారం ఉందని చెబితే నమ్ముతారా అన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించుకునే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు కేంద్రాన్ని అడగలేదన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించమని కేంద్రాన్ని కోరింది చంద్రబాబు కాదా అన్నారు.

 

చిదంబరాన్ని కలిసింది చంద్రబాబు కాదా అన్నారు. 2014లో తెలుగు రాష్ట్రాన్ని విభజించాలని తీర్మానం చేసింది ఆయనే అన్నారు. వైయస్‌ జగన్‌ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌, విద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే దిక్కూచిగా మారారని, అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం సరికాదని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల విభజనకు చంద్రబాబే కారణమని, అలాంటి వ్యక్తి తెలుగుపై మమకారం ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

 

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ భాష తెలుగు, ఆంగ్లం రెండూ ఉంటాయని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి కోసమే సీఎం వైయస్‌ జగన్‌ వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 35 శాతం నిరాక్షరాస్యత ఉన్న పరిస్థితుల్లో అందర్ని అక్షరాస్యులనుగా చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ పట్టుదలతో ఉన్నారని, ఈ నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి, ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 

ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు తమ పిల్లలను ఉన్నతంగా చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారని,అందరికీ ఆంగ్ల మాద్యమం అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: