అసోం రాష్ట్రంలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన తరువాత హింసాత్మక నిరసనలు జరిగాయి. నిన్నటినుండి అసోం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గడచిన ఏడు రోజులలో కొనసాగిన ఆందోళనలో ఐదుగురు మరణించారు. డిసెంబర్ 11వ తేదీన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగా కొంతమంది అసోం బీజేపీ రాష్ట్ర నాయకులు బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయటంతో పాటు పదవులకు రాజీనామా చేశారు.
 
బీజేపీ పార్టీ నాయకులెవరూ బీజేపీ పార్టీ వైఖరిని సమర్థించలేకపోతున్నారు. బీజేపీ పార్టీ తరపున గెలిచిన అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కు వ్యతిరేకంగా బిల్లు విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ అసోం పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ జగదీష్ భుయాన్ తాను ప్రజల పక్షానే ఉండాలనుకున్నానని ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని అనుకున్నానని కానీ కేంద్రం ప్రజల మనోభావాలను గౌరవించకపోవటంతో ప్రజల ముందుకు వచ్చానని అన్నారు. 
 
జోర్హాట్ బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో పునర్ పరిశీలించాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యలు చేశారు. అసోం గణ పరిషత్ ఎమ్మెల్యే రామేంద్ర నారాయణ్ కలిట వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించటం తప్పని ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము చట్టబద్ధంగా పోరాడతామని వ్యాఖ్యలు చేశారు. 
 
బీజేపీ నాయకులే బిల్లును వ్యతిరేకిస్తూ ఉండటంతో అసోం ముఖ్యమంత్రి సోనోవాల్, కొందరు సీనియర్ నాయకులు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అసోం రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు 1985 సంవత్సరంలో విదేశీ వలసదారులకు వ్యతిరేకంగా ఆరు సంవత్సరాల పాటు సాగిన ఆందోళన ఫలితంగా కుదిరిన ఒప్పందాన్ని గౌరవించాలని కోరుతున్నారు. ఈ ఒప్పందంలో అసోం సంస్కృతి, సామాజిక, భాషాపరమైన గుర్తింపును పరిరక్షించడం భాగమని ప్రజలు, పార్టీలు చెబుతున్నాయి. ఈ బిల్లుపై ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: