చంద్రబాబు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు.. ఉమ్మడి ఏపీకి సీఎంగా 9 ఏళ్లు పని చేశారు.. ఏపీకి ఐదేళ్లు సీఎంగా చేశారు. కానీ ఇప్పుడు పాపం.. మూడు గ్రామాలకు పరిమితం అయ్యారట. అమరావతి ఉద్యమం కోసం ఆయన పడుతున్న తపన.. చివరకు ఆ మూడు గ్రామాలకే పరిమితం చేస్తోందంటున్నారు వైసీపీ నాయకులు.

 

 

వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించడం టీడీపీకి కడుపు మంటగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు భూమి ఇస్తే దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలకు ఎందుకంత కడుపుమంట. టీడీపీకి చెందిన వారు, ధనవంతులు మాత్రమే రాజధాని ప్రాంతాల్లో ఉండాలా.. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా? అని నిలదీశారు.

 

ఎప్పుడైనా పేదవాడికి సెంటు భూమిచ్చారా.. చాలా దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు చేస్తున్నారు.. జగన్ ప్రభుత్వం ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు మూడు గ్రామాల ప్రజలకు నేతగా మిగిలిపోయారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

 

ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇంటివద్దకే పింఛన్ల పంపిణీ అద్భుతమైన ఫలితాలనిస్తోందన్నారు. పటిష్టమైన గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం వైయ‌స్‌ జగన్‌ తీసుకువచ్చారన్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగిందని.. మధ్యాహ్నానికే 80 శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు. ఆదివారమైనా లబ్ధిదారులకు పింఛన్లు అందాయని ఆయన పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: