తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ 235 కోట్ల రూపాయలు ఉద్యోగుల సమ్మె కాలానికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సమ్మె కాలానికి జీతాలను విడుదల చేయడంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
2019 సంవత్సరం దసరా సెలవుల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని 60 రోజులకు పైగా సమ్మె చేశారు. సమ్మె సమయంలో కొందరు ఉద్యోగులు గుండెపోటుతో మృతి చెందారు. గతంలోనే కేసీఆర్ సమ్మె కాలపు జీతాలను చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం 2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. అధికారికంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. 
 
కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సమ్మె సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలకే డ్యూటీ ముగిసేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారికి ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటన చేశారు. 

2019 అక్టోబర్ నెలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ఆ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కఠినంగానే వ్యవహరించింది. కొన్ని రూట్లను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటన చేసింది. చివరకు ఆర్టీసీ కార్మికులు మళ్లీ విధుల్లో చేరతామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీలో ఉన్న సమస్యలపై సమీక్ష నిర్వహించి సంస్థ నిలదొక్కుకోవడానికి కొన్ని సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: