ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు అందుకుంది. దీంతో ఏపీలో ప్రచారాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేసుకుంటుంటే టీడీపీకి మాత్రం వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. కాగా., ఒక్కొక్కరిగా సీనియర్ నేతలు తెలుగు దేశం పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో మరో నేత తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. 


ఇప్పుడు ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్దా రాఘవరావు కూడా టీడీపీకి బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వైఎస్సార్‌ సీపీ నేతలతో శిద్దా టచ్‌ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ  శనివారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. 


టీడీపీ హయాంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ.. శిద్దా రాఘవరావు మంత్రిగా పనిచేశారు. టీడీపీ తరపున 2004లో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా శిద్దా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో నియోజకవర్గం మార్చి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. తర్వాత  చంద్రబాబు కేబినెట్‌ లో మంత్రిగా పనిచేశారు. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాలతో 2019 ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేయలేదు. దర్శిని వదిలి పెట్టి ఒంగోలు లోక్‌ సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 


ఇదిలాఉండగా.. ఇప్పటికి ప్రకాశం కు చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా వైఎస్సార్‌ సీపీకి జైకొట్టిన సంగతి విదితమే.. బలరాం పార్టీలో చేరకపోయినా.. వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలిపారు. తన కుమారుడితో పాటూ మాజీ మంత్రి పాలేటి రామారావు, ఇతర నేతలు మాత్రం జగన్ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. తాజాగా రాఘవరావు కూడా పార్టీ వీడతారనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన కూడా తెలుగు దేశాన్ని వీడితే.. బాబుకు ఎదురు దెబ్బ తగిలినట్లే అంటున్నారు కొందరు నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: