తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నెదర్లాండ్ నుండి రాష్ట్రానికి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ వ్యక్తి రంగారెడ్డి జిల్లాలోని కొత్తపేట కాలనీలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివశిస్తున్నాడు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వ్యక్తి దాదాపు 12 మందితో సన్నిహితంగా ఉన్నాడని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఆ వ్యక్తి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఆ వ్యక్తి సందర్శించిన ప్రాంతాలు, అతని కుటుంబ సభ్యులు, అతడు సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఇటలీ నుండి వచ్చిన ఒక వైద్య విద్యార్థినికి కరోనా అని తేలడంతో ఆమె ఇప్పటికే గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. 
 
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో హన్మకొండకు చెందిన ఒక వ్యక్తి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. ఐసోలేషన్ వార్డులో అతనికి చికిత్స జరుగుతోంది. మరో వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో ఎంజీఎంకు వచ్చి చెప్పకుండానే అక్కడినుండి వెళ్లిపోయాడు. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం నాటికి దేశంలో 107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం 7 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మూడు కేటగిరీలుగా విభజించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని ప్రణాళిక రచిస్తోంది. ఐసోలేషన్ కు సహకరించని వారిని పోలీసుల సాయంతో కేంద్రానికి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: