సీఎం కేసీఆర్ నిన్న ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించనున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నేడు లాక్ డౌన్ పై ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈరోజు ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాల్లో అంటువ్యాధుల నియంత్రణ చట్టం - 1897, విపత్తు నిర్వహణ చట్టం - 2005 కింద లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే కరోనా వైరస్ ను మహమ్మారిగా పేర్కొందని... రాష్ట్రానికి వైరల్ వల్ల ముప్పు ఉండటంతో కీలక చర్యలు చేపట్టినట్లు ప్రకటన చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల్లో ఈ నెలాఖరు వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొంది. మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
సాయంత్రం 6 తర్వాత ఆస్పత్రులు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు నివాసానికి మూడు కిలోమీటర్ల పరిధిలోనే సరుకులు కొనుగోలు చేయాలి. లాక్ డౌన్ ఆదేశాల అమలు కోసం ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేయనుంది. నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 
 
బైక్ పై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని ప్రభుత్వం సూచించింది. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు అన్ని షాపులు బంద్ చేయాలని పేర్కొంది. 6 తరువాత నిత్యావసర వస్తువులకు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. సీఎస్ అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: