బెజవాడలో ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కనీస వైద్యం అందించకుండా సాధారణ అనారోగ్య సమస్యలతో వస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు.  డయాలసిస్ అందక ఒక వ్యక్తి మృతిచెందటం కలకలం రేపింది.  ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలకు  సిద్ధమయ్యారు.

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ కు ఆదేశాలు ఇచ్చింది.  అత్యవసర సేవలు అందించాల్సిన ఆసుపత్రులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ రోగులకు వైద్య సాయం అందడం లేదు. డాక్టర్లు అసలు ఆసుపత్రులకే రావడం మానేశారు. చాలావరకూ ప్రైవేట్ హాస్పిటల్స్ మూసివేశారు.  ఒకటీ అరా తెరిచిఉన్నా...కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందిని మాత్రం అందుబాటులో ఉంచుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి డాక్టర్లు లేరంటూ వెనక్కి పంపుతున్నారు. ఇక అత్యవసర ఓపీలు మాత్రమే ఇస్తున్నారు తప్ప సాధారణ ఓపీలు చూడని దారుణ పరిస్థితి బెజవాడలో ఉంది.

 

వైద్యం అందని దారుణ పరిస్థితులపై నాలుగు రోజుల క్రితం బెజవాడ పోలీస్ కమిషనర్ ....జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆయనన వెంటనే డీఎంహెచ్ ఓ ద్వారా బెజవాడ డాక్టర్లతో  సమావేశం నిర్వహించారు.   ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పి వెళ్లారు. అయితే మళ్ళీ అదే సీన్ బెజవాడలో రిపీట్ అవుతున్నట్టు మరోసారి కలెక్టర్ దృష్టికి వెళ్లింది.

 

బెజవాడలో ఒక రోగి ఊపిరితిత్తుల సమస్యతో పలు ఆసుపత్రులకు వైద్యం కోసం తిరిగినా వైద్యం దొరక్క చనిపోవటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఒకసారి చెప్పినా మళ్ళీ ఇలానే ప్రవర్తిస్తారా అంటూని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వైద్యం చేయకపోతే.. ఆసుపత్రులు, డాక్టర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

 

అందరూ ప్రైవేటు డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.  ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సేవలపై నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు ఉన్నతాధికారులు. మరి ఇప్పటికైనా ప్రైవేట్ ఆసుపత్రులు తీరు మార్చుకుంటాయో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: