తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బహిరంగంగా సవాల్ విసిరారు. కరోనా సమయంలో తప్పుడు కథనాలు రాసినందుకు తప్పకుండా శిక్షిస్తానని ఇటీవల ఓ మీడియా సమావేశంలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. దీనిపై స్పందించిన ఏబీఎన్‌ రాధాకృష్ణ.. కేసీఆర్ బెదిరింపలకు ఏమాత్రం భయపడనని తేల్చి చెప్పారు. తన కొత్త పలుకు శీర్షికలో కేసీఆర్ వైఖరిపై ఆర్కే నిప్పులు చెరిగారు.

 

 

ఆయన ఏం రాశారంటే.. " ఆంధ్రజ్యోతి’కి ఇలాంటి హెచ్చరికలు అలవాటే! మీరు గుడ్లు ఉరిమితే ఇక్కడెవరూ భయపడరు! మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము. ఆరేళ్లుగా ఫామ్‌ హౌస్‌లోనో ప్రగతి భవన్‌లోనో సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉన్న మీకు ఇప్పటి లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలిసే అవకాశం లేనందున, ప్రజా సమస్యలను మేం బాజాప్తా ప్రచురిస్తాం. ప్రచురిస్తూనే ఉంటాం!.. అంటూ సవాల్ విసిరారు.

 

 

వైద్యుల సమస్యను వెలుగులోకి తెచ్చిన పాపానికి ‘ఆంధ్రజ్యోతి’కి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తానని కూడా కేసీఆర్‌ హెచ్చరించారని ఆర్కే గుర్తు చేశారు. అంతా తనకే తెలుసును అని భావిస్తున్న కేసీఆర్‌కు ఒక విషయం గుర్తుచేయాలని... ప్రభుత్వాలు కేసులు మాత్రమే పెట్టగలవని ఆర్కే చెబుతున్నారు. శిక్షలు విధించే అధికారం న్యాయస్థానాలకే ఉంటుందని.. అయినా వాళ్లకీ, వీళ్లకీ కరోనా సోకాలని శపించడం ద్వారా ఆ వైరస్‌ వ్యాప్తిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్న మీకే న్యాయంగా శిక్ష పడాలని కేసీఆర్ ను ఉద్దేశించి ఆర్కే రాసుకొచ్చారు.

 

 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కే కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ మీడియాను బెదిరించడానికి అలవాటుపడ్డారని.. ఇప్పుడు సూచనలను కూడా స్వీకరించే స్థితిలో లేరని.. శిక్షలు విధిస్తానని హెచ్చరికలు చేస్తున్నారని రాసుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: