వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎంత మొండి వాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించడంలో జగన్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారు. మాట తప్పను మడమ తిప్పను అనే సూత్రాన్ని జగన్ ఇప్పటికీ పాటిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి మొత్తం కరోనా మీద పెట్టాయి. మిగతా రాష్ట్రాల్లో ప్రజా సంక్షేమ పథకాలను పూర్తిగా పక్కన పెట్టేసి, కేవలం కరోనా పైనే దృష్టి పెట్టగా, ఏపీలో మాత్రం జగన్ ఆవిధంగా చేయకుండా ప్రజా సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేసుకుంటూ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఒకవైపు రాష్ట్రానికి పన్నుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేంద్ర పన్నుల వాటాలో కోత పడింది. అయినా జగన్ నవరత్నాలు నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు.

 

 ఈ సమయంలోనూ డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించారు. దాని ప్రకారం వారికి 1400 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ఈ పథకాన్ని జగన్ ప్రకటిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ జగన్ మాత్రం ఈనెల 24వ తేదీన డ్వాక్రా మహిళలకు 1400 కోట్లు విడుదల చేస్తూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు తాము కట్టిన వడ్డీ డబ్బులు వెనక్కి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయనున్నారు. 

 


రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకోవడానికి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా, ఈసారికి కాలేజీలకు ఫీజుల రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తున్నా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సొమ్మును జమ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో 50 వేల రూపాయల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు నవరత్నాలలో కూడా ఈ హామీని ప్రకటించారు. అలాగే సామాజిక పెన్షన్ల సొమ్ముని మరో 250 రూపాయలు పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే రైతు భరోసా సొమ్ములను మే నెలలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పథకం భారమైనా, జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తుండడం వైసీపీ ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకు వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: