దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా బాధితుల చికిత్స కోసం వైద్యులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వైద్యులకు భద్రత కల్పిస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. 
 
తాజాగా ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కనీస సౌకర్యాలు లేకపవడంతో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాల్లోకి వెళితే రాయ్‌బ‌రేలీలో క‌రోనా సోకిన బాధితుల‌కు చికిత్స అందిస్తున్న వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో క్వార్టర్స్ ఏర్పాటు చేసింది. విధులు ముగించుకుని క్వార్టర్స్ కు వెళ్లిన వైద్యులు అక్కడ కనీస వసతులు లేకపోవడంతో షాక్ అయ్యారు. 
 
వెంటనే వైద్యులు క్వార్టర్స్ లో పరిస్థితులను వీడియో తీసి స్థానిక చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ కు పంపారు. వైద్యులు తమ గదిలో ఫ్యాన్ కూడా లేదని... ఒకే గదిలో నాలుగు మంచాలు ఏర్పాటు చేశారని... గదిలో నాలుగు గంటలు కరెంట్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. గదిలో మంచినీరు లేకపోవడం, బాత్ రూమ్ లో యూరిన్ పైపు సరిగ్గా లేకపోవడం, పాలిథీన్ కవర్ లో పూరీ, సబ్జీని ఆహారంగా పంపించడంతో తాము నరకయాతన అనుభవించామని వైద్యులు చెబుతున్నారు. 
 
వైద్యుల సమస్యలపై చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఎస్‌కే శ‌ర్మ స్పందించారు. వారు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడిన మాట వాస్తవమేనని... వారిని గెస్ట్ హౌస్ కు తరలించి... వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 21,353 కు చేరగా మృతుల సంఖ్య 700కు చేరువలో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 1800 దాటింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: