సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినవారిపై వైసీపీ సర్కారు కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఎవరైనా తమ పట్ల అసభ్యంగా, అనుచితంగా పోస్టులు పెట్టారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై ఐటీ చట్టం కింద చర్యలు తీసుకుంటోంది. మొన్న రంగనాయకమ్మ అనే వృద్ధరాలికి ఏకంగా సీఐడీ ద్వారా నోటీసులు ఇచ్చి విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ముగ్గురిపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

 

 

వారిలో ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష అనే 28 ఏళ్ల యువతి ఒకరు. ఈమె గత నెలలో వైసీపీ మంత్రులు చేసిన కరోనా సాయంపై ఓ పత్రికలో వచ్చిన ఫోటోను కోట్ చేస్తూ కామెంట్లు పెట్టింది. దీనిపై స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే సాధారణంగా ఇలాంటి నోటీసులు వచ్చినప్పుడు నోటీసు అందుకున్నవారు కాస్త ఆందోళన చెందుతారు.. తమను ఇలా ఎందుకు వేధిస్తున్నారని నిలదీస్తారు.

 

 

కానీ ఈ ఉండవల్లి అనూష అనే అమ్మాయి మాత్రం.. అదేదో గిన్నిస్ రికార్డు అందుకుంటున్నంత ఆనందంగా ముఖం సంతోషంతో వెలిగిపోతుండగా పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతే కాదు.. దయచేసి పోలీసులు కేసులు పెడుతున్నారు అని భయపడవద్దు... వాళ్ళ తప్పులని ప్రజల్లోకి తీసుకోని వెళ్ళదాం.. ప్రశ్నించే హక్కు మన అందరికి ఉంది కాని మన నాయకుడు మనకి ఇచ్చిన సూచనల ప్రకారం పనిచేద్దాం.. చేయి చెయి కలిపి ముందుకు నడుద్దాం... ప్రభుత్వ వైఖరిని ఎండగడదాం ! అంటూ ఫేస్ బుక్ లో పిలుపు ఇస్తున్నారు.

 

 

ఉండవల్లి అనూష మొదటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తెలుగుదేశం అభిమానిగా ఆమె చాలా చురుగ్గా ఉంటున్నారు. ఆమెకు ఫేస్ బుక్‌లో దాదాపు 11 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ కేసు ఏం మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: