మాజీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి కి వచ్చాక జగన్ సర్కారుపై విమర్శల డోసు పెంచారు. భూకబ్జాల కోసమే విశాఖను రాజధానిగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తాజాగా చంద్రబాబు ఆరోపించారు. దీంతో వైసీపీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి విశాఖ నేతలు చంద్రబాబు ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తున్నారు.

 

 

ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ మరో అడుగు ముందుకేసి చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖలో గజం స్థలం అవినీతి జరిగిందని, భూకుంభకోణం జరిగిందని చంద్రబాబు నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. తన సవాల్ కు చంద్రబాబు అంగీకరించాలని.. అంతే తప్ప.. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.

 

 

ఇదే సమయంలో అవంతి శ్రీనివాస్ మిగిలిన అంశాలపైనా స్పందించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనలోనే 90 శాతం హామీలు నెరవేర్చారని.. అది చూసి ఓర్వలేక చంద్రబాబు ఇష్టారీతిన బురద చల్లుతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్న మంత్రి అవంతి.. విద్యతోనే పేదల జీవితాల్లో మార్పులొస్తాయని సీఎం గట్టిగా నమ్మారన్నారు. అందుకే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,500 కోట్లు జమ చేశారని మంత్రి అవంతి అన్నారు.

 

 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అని మంత్రి అవంతి ప్రశ్నించారు. రెండు నెలల తరువాత రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు మహానాడులో ప్రజలను మభ్యపెడుతూ మాట్లాడుతున్నారన్నారు. మహానాడు వేదికపై 2019 ఓటమిపై విశ్లేషించుకుంటే బాగుండేదని సలహా ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: