ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేస్తున్నా వైరస్ ను కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా సఫలం కావడం లేదు. రాష్ట్రంలో పల్లెల్లో కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. కొందరికి కరోనా సోకినా పరీక్షల్లో మాత్రం నెగిటివ్ గా నిర్ధారణ అవుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2593 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వైరస్ విసృతంగా వ్యాప్తి చెందుతోంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 35,159 కేసులు నమోదు కాగా దాదాపు 5000 కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదయ్యాయి. 
 
నిన్న ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 590 కేసులు నమోదు కాగా కరోనా బాధితుల సంఖ్య 4816కు చేరింది. అనంతపురంలో 3987, గుంటూరులో 3963, తూర్పుగోదావరిలో 3862, చిత్తూరులో 3536 కేసులు నమోదయ్యాయి. కృష్ణా, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. 
 
ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లే భారీగా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి సోకుతుందో ఎవరూ చెప్పలేరని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే వైరస్ భారీన పడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సబ్బు, శానిటైజర్లతో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.          
    

మరింత సమాచారం తెలుసుకోండి: