జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారపార్టీపై , సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే వైయస్సార్సీపీ ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. జగన్ అప్పుడే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నానని చెప్పి ఉంటే అమరావతి రైతులు అన్ని వేల ఎకరాల భూమిని ఇచ్చి ఉండేవారు కాదేమోనని అన్నారు.
రాజధానిని మార్చడం రైతులను మోసం చేయడమేనని ఘాటు విమర్శలు చేశారు. పాలకులకు రైతు కన్నీరు మంచిది కాదని పేర్కొన్నారు. జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశం గురించి అసెంబ్లీలో తీర్మానం చేసింది కాబట్టి మండలి ఆమోదం అవసరం లేదని ప్రభుత్వం బిల్లును గవర్నర్ కు పంపిందని.... ఇప్పుడు నిర్ణయం కోసం అందరం వేచి చూస్తున్నామని చెప్పారు.
టీడీపీ రాజధాని విషయంలో అంత భూమిని సేకరించడం తప్పని... రైతుల నుంచి భూములను తీసుకుని చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని అని అన్నాడని.... ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని తాను ఆనాడే చెప్పానని.... నేడు భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజధానులను విడగొట్టిననంత మాత్రాన రాష్ట్రంలో అభివృద్ధి జరగదని అన్నారు. టీడీపీ వైయస్సార్సీపీ ఆధిపత్య పోరులో రైతులు నలిగిపోతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా రోగులు ఆస్పత్రికి వెళితే అక్కడ సరైన సదుపాయాలు ఉండడం లేదని చెప్పారు. ఇళ్ల పట్టాల కొనుగోలులో చాలా ప్రాంతాల్లో అవినీతి జరిగిందని అన్నారు. నిజమైన లబ్ధిదారులకే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలతో లక్షల ఇళ్లను నిర్మించిందని... నిజమైన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని కోరారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి