తెలుగులో ఇప్పుడు మీడియా రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అసలే మీడియా అంటే పెద్దగా లాభాలతో కూడిన వ్యవహారం కాదు.. ఏదో పరపతి, పరిచయాలు, రాజకీయ లబ్ది.. వంటి అంశాలు ఎక్కువగా మీడియాను నడిపించే పెద్దల్లో ఉంటాయి. అంతే తప్ప.. మీడియాను  ఓ వ్యాపారంగా భావించి లాభాలు ఆర్జించడం అంటే అది అంత సులభం కానే కాదు. 

 


ఈ విషయం ఎన్నోసార్లు రుజువయ్యింది. అందులోనూ ఇది కరోనా కాలం.. మీడియాకు మరింత గడ్డు కాలం.. అన్ని వ్యాపారాలూ డీలా పడిన వేళ ఇక మీడియాకు ప్రకటనలు ఇచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగులో ఓ ఛానల్ లో కీలక మార్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కమ్యూనిస్టులు నడిపించిన ఓ ఛానల్ ను కొంతకాలం కిందట కేసీఆర్‌ కు సన్నిహితుడైన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కొనుగోలు చేశారు. 

 


వాస్తవానికి సదరు వ్యాపార వేత్త తెలుగులోని టాప్ ఛానల్‌ను కొనాలని ఆలోచించారు. కానీ అక్కడి పెద్ద తలకాయ దాన్ని వర్కవుట్ కానివ్వలేదు. ఎలాగైనా సరే మీడియా రంగంలోకి రావాలనుకున్న సదరు పారిశ్రామికవేత్త అప్పటికే నష్టాల్లో ఉన్న కమ్యూనిస్టు ఛానల్‌ను కొనేశారు. ఆ తర్వాత టాప్ తెలుగు చానల్ కూడా ఆ పారిశ్రామిక వేత్త చేతుల్లోకే వచ్చింది. 

 


ఇప్పుడు రెండు న్యూస్ ఛానళ్ల యజమాని అయినా సదరు పారిశ్రామిక వేత్త టాప్ తెలుగు ఛానల్‌ను అలాగే ఉంచి.. కమ్యూనిస్టు చానల్ ను ఎంటర్‌టైన్‌ మెంట్ ఛానల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఇప్పుడంతా ఓటీటీల ప్రభావం నడుస్తున్నందువల్ల కొత్త తరహా ప్రయత్నాలు చేసే ఆలోచనా ఉందట. ఏదేమైనా మొత్తానికి ఆ ఛానల్‌ ను ఎంటర్‌టైన్‌ మెంట్ ఛానల్ చేయడమో.. లేక.. మూసేయడమో ఏదో ఒకటి జరగొచ్చని మీడియా సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..? 

మరింత సమాచారం తెలుసుకోండి: