పాతబస్తీలో గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ సజావుగా జరిగేందుకు సంబంధిత శాఖ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ పరిధిలోని అన్ని సర్కిళ్లలో గ్రేటర్‌ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద తగిన బందోబస్తు చర్యలు తీసుకున్నామని  జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌ ఎన్‌.సామ్రాట్‌ అశోక్‌ తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఓటరు ఫోటో, గుర్తింపు కార్డులు లేని వారు కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చన్నారు.

ఓటరుకు సంబంధించి ఏదో ఒక గుర్తింపు కార్డును ఎన్నికల అధికారులకు చూపించి తమ ఓటును వినియోగించుకోవచ్చన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎన్నికల కమిషన్‌ అధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో నలుగురుకు మించి ఒకే చోట గుమిగూడటాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు.

చార్మినార్‌ సర్కిల్‌-9లోని పత్తర్‌గట్టి, ఘాన్సీబజార్, పురానాపూల్, మొఘల్‌పురా, శాలిబండ తదితర డివిజన్లలో టీఆర్‌ఎస్, మజ్లీస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు మంగళవారం జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సంతోష్‌నగర్‌ సర్కిల్‌-7లోని ఐఎస్‌సదన్, రెయిన్‌బజార్, తలాబ్‌చంచలం, గౌలిపురా, కుర్మగూడ, సంతోష్‌నగర్‌ తదితర డివిజన్లలో పలు పార్టీల అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: