విమానంలో ప్రయాణం చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.. కానీ ఇది కాస్ట్‌లీ ప్రయాణం. అయినా సరే.. విమానం ఎక్క గలిగే వాళ్లకు కూడా కొన్ని సందేహాలు వేధిస్తుంటాయి. కొన్ని భయాలు ఉంటాయి. అసలు ఈ విమాన ప్రయాణం క్షేమమేనా?’  ‘అనుకోని పరిస్థితుల్లో కిటికీ అద్దాలు పగిలిపోతే? ‘విమానం టైర్లు పేలితే ఎలా?’.. తరచూ సందేహాలు పెద్దలకూ వస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు  ‘101 ఫ్లయింగ్‌ సీక్రెట్స్‌’ అనే ఆంగ్ల పుస్తకంలో ఆ ప్రశ్నలకు సవివరమైన, శాస్ర్తీయమైన సమాధానాలు ఇచ్చారు హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌ ధన్నారపు.

ఈ యువకుడు... ఆస్ట్రేలియాలోని రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకున్నాడు. విమానాలపై అధ్యయనాలు చేశాడు. విమాన ప్రయాణంలో ఉన్నప్పడు కిటికీలు బద్దలైతే? అన్న డౌట్ రావచ్చు.. కానీ.. పదునైన లోహపు వస్తువులు, కత్తులు, నెయిల్‌కట్టర్లు విమానంలో తీసుకెళ్లనీయరు. ఇక, విమానం కిటికీలను పాలీ కార్బొనేట్‌తో తయారుచేస్తారు. బలమైన మనిషి పిడికిలితో బాదినా అది పగలదు. అంతేకాదు, విమానం గాల్లో అంత వేగంగా వెళుతున్నప్పుడు పడే ఒత్తిడినీ, గాలీ వానా ఎండలనూ తట్టుకునే శక్తి కిటికీ అద్దాలకు ఉంటుంది. అవీ మూడు పొరలుగా ఉంటాయి. కాబట్టి, భయపడాల్సిన పన్లేదు.

అలాగే.. ఆక్సిజన్‌ ఆగితే.. అన్న అనుమానం వస్తుంది. ముప్పయివేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు.. హఠాత్తుగా ఆక్సిజన్‌ ఆగిపోతే.. ఆ విషయాన్ని సెన్సర్లు గుర్తిస్తాయి. వెంటనే సీటుపైనున్న ఆక్సిజన్‌ మాస్క్‌లు తెరుచు కుంటాయి. వాటిని నోటికి అమర్చుకోగానే, రసాయన చర్య జరిగిపోయి... ఆక్సిజన్‌ సరఫరా మొదలవుతుంది. అలా, ఇరవై నుంచి ముప్పయి నిమిషాల పాటు ప్రాణవాయువు అందుతుంది. అంతలోపు విమానం కిందికి వచ్చేస్తుంది. 20 వేల అడుగుల కిందికి విమానం రాగానే, ఇక ఆక్సిజన్‌ సమస్య ఉండదు. ఇంజన్‌ నుంచి గాలిని తీసుకుని.. లోపలికి పంపిస్తుంది. ఇక మాస్క్‌లు తీసేయొచ్చు. అవసరమైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తారు. కాబట్టి విమానానికి సంబంధించిన భయాలు ఉంటే పక్కకు పెట్టేయండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: