ఏపీ సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో ఉద్యోగ నియామ‌కాల క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేశారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ....టీడీపీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించారు. అంతే కాకుండా ప్ర‌త్యేక‌హోదా అంశం గురించి కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ...ఇది వ‌ర‌కు నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే పరిస్ధితి ఉండేదన్నారు. పట్టణాల్లో ఏళ్లకు ఏళ్లు అద్దెలు కడుతూ కోచింగులు తీసుకున్నా చివరకు నోటిఫికేషన్ వచ్చేది కాదని విమ‌ర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం ఖాళీగా ఉన్నలక్ష 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పారని అన్నారు. కానీ హామీని నెర‌వేర్చ‌లేద‌ని చెప్పారు.

అంతే కాకుండా ప్ర‌త్యేక‌ హోదా ద్వారా ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగాలనూ తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్ల కోసం ప్రత్యేక హోదాను గత ప్రభుత్వం పూర్తిగా తాకట్టుపెట్టింద‌ని అన్నారు. గతంలో అప్పటి ప్రభుత్వం ప్యాకేజీ కోసం రాజీ పడిందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దానివల్ల ఇప్పుడు డిల్లీ వెళ్లిన ప్రతి సారీ ప్రత్యేక హోదా ఇవ్వాలని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్ధితి వ‌చ్చిందంటూ సీఎం జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పదే పదే అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితి వచ్చిందని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం ఉందని ఎవరి మ‌ద్ద‌తు కూడా వారికి అవ‌స‌రం లేద‌ని అన్నారు. దేవుడి దయతో ఎప్పుడో ఓ సారి మంచి జరుగుతుందని అనుకుంటున్నాన‌ని చెప్పారు.

ఇక జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఏపీకి ప్ర‌త్యేక హోదా అన్న‌ది ఒక క‌ల గానే మిగిలిపోతుంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా తీసుకువ‌చ్చి తీరుతాం అన్న వైసీపీ ఎంపీలు గ‌ద్దెనెక్కిన త‌రవాత మాత్రం నోరుమెద‌ప‌డం లేదు. అంతే కాకుండా టీడీపీ హ‌యాంలో ప‌దేప‌దే ప్ర‌త్యేక హోదా అంశాన్ని లేవ‌నెత్తి విమ‌ర్శ‌లు కురిపించిన వైసీపీ తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత కూడా మ‌ళ్లీ టీడీపీ పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కూ జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన‌ప్పుడో మిగ‌తా సంద‌ర్భాల్లోనో ప్రత్యేక హోదా అంశం చ‌ర్చ‌కు వ‌చ్చేది. కానీ ఇప్పుడు ముఖ్య‌మంత్రి దేవుడిమీదే భారం వేసి చేతులు దులుపుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: