ఇక ఇప్పుడు కిలో లోపున్న కవర్లను జనం కండక్టర్ల వద్దే బుక్ చేసుకోవచ్చు.. ఇప్పటి వరకూ ఇలాంటి కవర్ల విషయంలో జనం కొరియర్ వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు. ఇక ఆర్టీసీ కూడా ఇప్పుడు ఇదే తరహా సేవలు అందించబోతోంది. ఇకపై ఓ బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ వరకు కొరియర్ కవర్లు అందించబోతోంది. అంటే ఆర్టీసీ కార్గో సేవలు ఇక గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయన్నమాట. చిన్న పట్టణాలు, పల్లెలకు వెళ్లే బస్సుల్లో కండక్టర్ ద్వారా ఈ కవర్లు పంపొచ్చు.
ఇలా పంపే కవర్లకు కండక్టర్ల వద్ద ఉండే టికెట్ల జారీ యంత్రాల్లోనే కొరియర్ బుక్ చేస్తారు. వీటికి టిమ్ ద్వారానే స్లిప్ కూడా ఇస్తారు. ఈ కొరియర్ బుక్ చేసుకున్న వారు దాన్ని ఎవరికి ఇవ్వాలో వారి అడ్రస్ రాసి.. వాళ్లకు ఫోన్ చేసి బస్సు వచ్చే సమయం చెప్పాలి. కొరియర్ అందుకునేందుకు రెడీగా ఉండాలని చెప్పాలి. ఆ బస్టాప్‌లో బస్సులోని కండక్టర్ లేదా డ్రైవర్ ఈ కొరియర్ పార్సిల్ ను అందిస్తారు.
ఇలా టిమ్స్ ద్వారా కొరియర్ కవర్ల బుకింగ్‌ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఓ వారంలో ప్రారంభం కావచ్చట. దీని ద్వారా గ్రామాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉండేవారికి సైతం ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్టీసీ ద్వారా కొరియర్ సేవలు అందుకోవచ్చు. ఇప్పటికే ఆర్టీసీ కార్గో సేవల ద్వారా రోజూ రూ.40 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తోంది. ఇలా వినూత్నంగా ఆలోచిస్తే ఆర్టీసీ ప్రజాసేవలో మరింత మమేకం కావచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి