ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్‌లు మంచి దోస్తులు అనే సంగతి తెలిసిందే. అయితే వీరి దోస్తీ 2019 వరకే ఉంది. ఆ తర్వాత ఈ ఇద్దరు శత్రువులుగా మారిపోయారు. అవంతి వైసీపీలోకి వెళ్ళడంతో ఇద్దరి మధ్య సైలెంట్ వార్ నడవటం మొదలైందని చెప్పొచ్చు. అసలు అవంతిని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది గంటానే. 2009 ఎన్నికల్లో గంటా..అవంతిని ప్రజారాజ్యంలోకి తీసుకొచ్చారు. ఇద్దరు నేతలు ప్రజారాజ్యం తరుపున ఎమ్మెల్యేలుగా కూడా గెలిచారు.

ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు కూడా ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. నెక్స్ట్ గంటా టీడీపీలోకి వచ్చారు. తనతో పాటు అవంతిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేసి గెలిచారు. గంటా..భీమిలి నుంచి ఎమ్మెల్యేగా, అవంతి..అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. పైగా టీడీపీ అధికారంలో ఉండటంతో ఐదేళ్ల పాటు వారి రాజకీయం బాగానే నడిచింది.

ఇక 2019 ఎన్నికల ముందు అవంతి..గంటాకు షాక్ ఇస్తూ...ఒక్కరే వైసీపీలో చేరిపోయారు. భీమిలి బరిలో నిలబడ్డారు. కానీ గంటా టీడీపీలోనే ఉన్నారు. పైగా భీమిలిని వదిలిపెట్టి విశాఖ నార్త్‌లో పోటీ చేశారు. ఇక్కడ నుంచి ఇద్దరు నేతల మధ్య శతృత్వం పెరిగింది. ఆ ఎన్నికల్లో కూడా ఇద్దరు నేతలు గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో అవంతి మంత్రి అయ్యారు. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా సైలెంట్ అయ్యారు. మధ్యలో వైసీపీలోకి వెళ్లడానికి ట్రై చేస్తే అవంతినే రాకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. దీంతో గంటాకు పార్టీ మారడానికి అవకాశం దొరకలేదు.

అయితే వచ్చే ఎన్నికల ముందు గంటా పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీకే అనుకూల పరిస్తితులు ఉంటే...ఆ పార్టీలోనే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు టీడీపీ తరుపున గంటా..భీమిలిలో పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే అవంతి, గంటాల మధ్య ఫైట్ ఉంటుంది. మరి చూడాలి ఈ ఇద్దరి రాజకీయం ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: