తిరుపతిలో అమరావతి రైతులు ఈనెల 17న తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాజధాని రైతులు మెుదట ఎస్వీ యూనివర్శిటి మైదానంలో సభ కోసం అధికారుల్ని సంప్రదించారు. అక్కడ అనుమతి లభించలేదు. ఆ తర్వాత ఓ ప్రైవేటు స్థలంలో సభకు అనుమతివ్వాలని పోలీసుల్ని రాజధాని రైతుల జేఏసీ నేతలు కోరారు. అయితే.. సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తిరుపతి అర్బన్ పోలీసులు శుక్రవారం ఓ లేఖ పంపారు. సభ అనుమతి నిరాకరణకు వారు అనేక కారణాలు చెబుతున్నారు.
అమరావతి రైతుల పాదయాత్రలో మొత్తం 42 రకాల ఉల్లంఘనలు జరిగాయని పోలీసులు అంటున్నారు. అంతే కాదు.. అమరావతి రైతుల సభ నిర్వహణపై కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే రాజధాని రైతులు మాత్రం తాము హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ సభ ఆగబోదని వారు అంటున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా బహిరంగ సభ నిర్వహించుకునే హక్కు ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛలో అది కూడా ఓ భాగమే. కావాలంటే కొన్ని నిబంధనలు పెట్టి సభకు అనుమతి ఇవ్వొచ్చు. ఇప్పుడు రైతులు హైకోర్టుకు వెళ్తే.. అక్కడ రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోసారి జగన్ సర్కారుకు ఈ విషయంలో మొట్టికాయలు తప్పవేమో అనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి