ఉద్యోగాలకు మళ్లీ మంచి కాలం వచ్చేసింది.. కరోనా నుంచి కోలుకుంటున్న అన్ని రంగాల్లోనూ మంచి ఉద్యోగాలకు అవకాశాలు వస్తున్నాయి. ఒమిక్రాన్ భయం ఉన్నా.. అది కొంతకాలమే అని సంస్థలు కూడా భావిస్తున్నారు. ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ రంగంలో కొత్తగా వస్తున్న ఫ్రెషర్లకు భారీ వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. కొత్తవాళ్లకు కూడా అమెజాన్ వంటి సంస్థలు ఏడాదికి రూ.33 లక్షల నుంచి రూ.44 లక్షల ప్యాకేజీలు అందిస్తున్నాయి. అంటే నెలకు రూ. 3 లక్షల నుంచి 4 లక్షల వేతనాలు అన్నమాట.


సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ఇటీవల అధిక ప్రాజెక్టులు రావడంతో ఉద్యోగుల వేటలో ఉన్నాయి. అందుకే తాజాగా బీటెక్‌ విద్యార్థులకు ఐటీ కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రత్యేకించి డిజిటల్‌ టెక్నాలజీలపై పట్టుంటే మంచి ప్యాకేజీలు దక్కుతున్నాయి. పలు సంస్థలు భారీ వార్షిక వేతన ప్యాకేజీలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి.



ఉదాహరణకు అమెజాన్‌ నిరుడు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌కు గరిష్టంగా రూ.33 లక్షల వార్షిక వేతనం ప్యాకేజీ ఇచ్చింది. అదే సంస్థ ఇప్పుడు ఏకంగా  రూ.44 లక్షల ప్యాకేజీ ఇస్తోంది. గతంలో సర్వీస్‌ కంపెనీలే ఎక్కువగా కొత్త ఉద్యోగాలు ఇచ్చేవి.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇందుకు కరోనా పరిస్థితి కూడా ఓ కారణం. ప్రతిదీ డిజిటల్ గా మారిపోతున్న సమయంలో దాదాపు అన్ని సంస్థలు ఆటోమేషన్‌కు వెళ్తున్నాయి. అందువల్ల చిన్న కంపెనీలకు  కూడా మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి.


గతంలో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి కంపెనీలు మాత్రమే అధికంగా వేతనం ఇచ్చేవి. ఇప్పుడు ఇతర సంస్థలు కూడా మంచి జీతాలు ఇచ్చి నియామకాలు చేస్తున్నాయి. ఈ పెద్ద సంస్థలు ఏడాదికి 30- 40 లక్షల వేతనాలు ఆఫర్‌ చేస్తుంటే.. ఇతర చిన్న సంస్థలు కనీసం రూ. 7 నుంచి 10 లక్షల వార్షిక వేతనాలు ఆఫర్‌ చేస్తున్నాయట. మొత్తానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: