ఏపీలో మంత్రి వర్గ విస్తరణ వాయిదాల మీద వాయిదా పడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరికి మంత్రి పదవులు దక్కాయి. అయితే ఈ మంత్రులను రెండేళ్ల తర్వాత మార్చేస్తానని సీఎం జగన్ మొదట్లోనే ప్రకటించారు. అలా జగన్ చెప్పిన సమయం పూర్తయిపోయి.. ఆరు నెలలు గడుస్తోంది. అయినప్పటికీ కొత్త మంత్రివర్గాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ ఆరు నెలలుగా మంత్రి వర్గ విస్తరణ కోసం ఆశావహులైన ఎమ్మెల్యేలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ ఎప్పుడు కరుణిస్తారా.. ఎప్పుడు మంత్రి పదవిలో కూర్చుందామా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇదే వాయిదా బాటలో మూడు రాజధానుల బిల్లు కూడా వచ్చి చేరినట్టుగా కనిపిస్తోంది.

ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదని.. మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఎన్ని విమర్శలు వచ్చినా, ఆందోళనలు జరిగినా మూడు రాజధానుల స్టాండ్ మీదే నిలబడింది. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నాక అతి త్వరలోనే దాన్ని తిరిగి ప్రవేశ పెడతామని అసెంబ్లీలోనే చెప్పారు జగన్. అయితే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలియడంలేదు. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకనో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరూ మూడు రాజధానుల విషయంపై స్పందించడం లేదు. గతంలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా రాజధాని ప్రస్తావన తీసుకొచ్చేవారు. అమరావతి రాజధాని వద్దని, మూడు రాజధానులు ఉంటేనే సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఉపన్యాసాలు దంచి కొట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల కొత్త బిల్లు వ్యవహారాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర ప్రభావం కూడా ప్రభుత్వంపై కొంతమేర ఉందని తెలుస్తోంది. ఈ దీక్షలకు బీజేపీతో పాటూ టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. దీంతో వైసీపీలో ఆలోచనలో పడింది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా అమరావతి రాజధాని కోసం పోరాడాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు. దీంతో వైసీపీ కూడా అమరావతి రాజధాని విషయంలో తొందరపడకూడదని భావించినట్టుగా తెలుస్తోంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా వేసినట్టుగా.. మూడు రాజధానుల విషయాన్ని కూడా ఇలా వాయిదాల మీద వాయిదాల వేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: