ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతల కామెంట్లు రోజు రోజుకీ సంచలనంగా మారిపోతున్నాయి. నేరుగా జగన్ రెడ్డీ అంటూ సీఎంని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో ట్విట్టర్లో సెటైర్లు వేశారు. జగన్ రెడ్డీ.. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని అన్నారు. నీ ఖేల్ ఖతం అంటూ మండిపడ్డారు.

సీఎం జగన్ ని చంద్రబాబుతో పోలుస్తూ వంగలపూడి అనిత ట్వీట్లు వేశారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న సీఎం పరదాలు, బ్యారికేడ్లు లేకుండా బయట కాలు పెట్టలేకపోతున్నారని, ఆయన ఓ యువనాయకుడని పిలువబడే వృద్ధుడు అని అన్నారు. అదే సమయంలో అర్థరాత్రి అవుతున్నా జనం జేజేల మధ్య, అలసటలేని ముఖంతో తమ నాయకుడు ఉన్నాడని చెప్పారు.

 

ఇటీవల చంద్రబాబు ప్రజాబాట పట్టారు. ఆయన కడప జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కడపలో కూడా బాబుకి జేజేలు అంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రముఖంగా వస్తోంది. దీనిపై వైసీపీ కూడా సెటైర్లు వేస్తోంది. కుప్పంలోనే చంద్రబాబుని ఎవరూ ఆదరించలేదు. అలాంటిది కడపలో ఆయనకు జన నీరాజనాలేంటని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. వీటికి కౌంటర్లుగా ఇటు టీడీపీ నుంచి కూడా మండిపడుతున్నారు నేతలు. యువనాయకుడనే వృద్ధ నాయకుడు జనాల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుంటున్నారని, ఇళ్లకు ముందు పోలీసులు నిలబడి పరదాలు అడ్డుపెడుతున్నారని, కొన్ని మార్గాల్లో ప్రజలు తిరగకుండా బ్యారికేడ్లు పెడుతున్నారంటూ మండిపడ్డారు వంగలపూడి అనిత. కానీ తమ నాయకుడు మాత్రం జనంలోకి వెళ్తున్నారని, జనం ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నారని చెప్పారు.

ఎన్నికలకింకా రెండేళ్ల సమయం ఉండగానే చంద్రబాబు స్పీడ్ పెంచారు. జనంలోకి వెళ్తున్నారు. అటు ముందస్తు ఎన్నికలపై కూడా కబురందించారు బాబు. సీఎం జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్తారని, గడప గడప కార్యక్రమంలో ప్రజా వ్యతిరేకత ఆయనకు తెలుస్తోందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: