సీఎం జగన్ ఇన్నాళ్లూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చాలా కూల్ గా ఉన్నారు. ఆయన ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, ఎంత వివాదం సృష్టించినా పోలీస్ కేసులు పెట్టారు కానీ, పార్టీనుంచి సస్పెండ్ చేయలేదు. ఆ మాటకొస్తే ఇటీవల కాలంలో వైసీపీనుంచి పెద్దగా సస్పెన్షన్లు లేవు. దాదాపుగా పార్టీలో తమకు అవకాశాలు లేవు అనుకున్నవారు కూడా బయట ఆల్టర్నేట్ లేదనే విషయం గుర్తించి వైసీపీలోనే ఉంటున్నారు. తమ అవకాశం కోసం వేచి చూస్తున్నారు. కానీ ఎక్కడా అసంతృప్తిని బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వైసీపీలో కూడా ముసలం పుట్టింది. తాజాగా కొత్తపల్లి సుబ్బారాయుడిపై సస్పెన్షన్ వేటు వేసి ఆ అసంతృప్తిని ఆపాలనుకుంటున్నా.. అది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి.

ఇటీవల పార్టీనుంచి వరుసగా సస్పెన్షన్లు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్ తర్వాత రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని కూడా పార్టీనుంచి బయటకు పంపించేశారు. నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి తనకు తానుగా పోటీదారుగా ప్రకటించుకున్నారు కొత్తపల్లి. వైసీపీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను కచ్చితంగా పోటీ చేస్తానని, అవసరమైతే ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని చెప్పారు. దీంతో పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముందు ఆయన బహిరంగ సభలో తనని తాను చెప్పుతో కొట్టుకోవడం, స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆయనకు ఉన్న గన్ మెన్స్ ని ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

ఇంకా ఎంతమంది ఉన్నారు..?
ఇటీవల గన్నవరం అసెంబ్లీ స్థానం విషయంలో కూడా ఇలాగే గొడవలు మొదలయ్యాయి. వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా గ్రూపులు మొదలయ్యాయి. వీటిని మొదట్లోనే తుంచేయాలని చూశారు సీఎం జగన్. 2024లో వంశీకే గన్నవరం టికెట్ అని ప్రకటన ఇప్పించారు. ఆ తర్వాత అక్కడ అసంతృప్తులు తగ్గకపోగా పెరిగాయి. ఇటీవల నెల్లూరులో కూడా ఇలాంటి గొడవే జరగడంతో వెంటనే పార్టీ సర్దుబాటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన నేతలు ఒకరితో ఒకరు గొడవలు పడటం ఇదివరకు పెద్దగా లేదు. ఇటీవల ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పార్టీకి ఇవి నష్టం చేకూరుస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. అందుకే జగన్ ముందు జాగ్రత్తగా ఇలాంటి వ్యవహారాలను మొదట్లోనే చక్కబెట్టాలనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: