చెప్పుకోవటానికి మాత్రమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. వాస్తవంగా అనుభవం దేనికి పనికిరావటంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరామ్ వర్గం చంద్రబాబునాయుడుపై భగ్గుమంటోంది. కారణం ఏమిటంటే నియోజకవర్గం ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణను ప్రకటించటమే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయిన తర్వాత నియోజకవర్గానికి ఇన్చార్జి ఎవరు లేరు. అందుకనే తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి చిన్న కోడెల తానే ఇన్చార్జిగాను, రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందని అనుకున్నారు.





అయితే కోడెల స్పీకర్ గా పనిచేసినపుడు చిన్న కోడెల, కూతురు విజయలక్ష్మిపైన విపరీతమైన ఆరోపణలున్నాయి. వీళ్ళ అరాచకపాలను టీడీపీ నేతలే తట్టుకోలేకపోయారు. అలాంటిది మాజీ స్పీకర్ చనిపోయిన తర్వాత చిన్నకోడెలకు ఎట్టి పరిస్ధితుల్లోను ఇన్చార్జి ఇచ్చేందుకు లేదని చాలామంది నేతలు చంద్రబాబునాయుడుతో చెప్పారు. ఇక్కడే చంద్రబాబు చాలా తప్పులుచేశారు. మొదటిది నియోజకవర్గానికి ఇన్చార్జిని నియమించకపోవటం. రెండోది చిన్నకోడెలకు ఇన్చార్జి పదవి ఇవ్వటం ఇష్టంలేకపోతే అదే విషయాన్ని చంద్రబాబు చెప్పేసుండాలి.





ఇన్చార్జి పదవికోసం చిన్నకోడెలతో పాటు రాయపాటి రంగారావు, అబ్బూరి మల్లి, జీవీ ఆంజనేయులు పోటీపడ్డారు. వీరిలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వకుండా కొత్తగా చేరిన కన్నాకు ఇవ్వటం కూడా తప్పే. కన్నాకు ఇన్చార్జి పదవి ఇవ్వదలచుకున్నపుడు పోటీలో ఉన్న వాళ్ళందరిని పిలిపించి మాట్లాడుండాల్సింది. ఏవీ చేయకుండా డైరెక్టుగా కన్నాను ఇన్చార్జిగా నియమించి మిగిలిన వాళ్ళకి సెంట్రల్ ఆఫీసునుండి ఫోన్ చేయించి కన్నాకు అందరు సహకరించాలని చెప్పించారు.





దాంతో చిన్నకోడెలకు బాగా మండి ఎదురుతిరిగారు. దాంతో చంద్రబాబులో టెన్షన్ మొదలై జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబులను బుజ్జగించేందుకు పంపించారు. తొందరలోనే తాను చిన్నకోడెలతో మాట్లాడుతానని వాళ్ళతో చెప్పించారు. కన్నాకు వ్యతిరేకంగా చిన్నకోడెల మాత్రమే బయటపడ్డారు. ఇదివరకే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతు కన్నా ఎక్కడ పోటీచేసినా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మరి మిగిలిన అబ్బూరి మల్లి ఏమిచేస్తారో చూడాలి. ఎలాగూ చిన్నకోడెలను బుజ్జగించటానికి జీవీ కూడా వెళ్ళారు కాబట్టి ఈ తమ్ముడితో సమస్య లేనట్లే అనుకోవాలి. చంద్రబాబు చేష్టలు చూస్తుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది అనే సామెత గుర్తుకొస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: