ఊరుకుంటే ఊరాపేరా అనే సామెత చాలా పాపులర్. టీడీపీలో సీనియర్ తమ్ముడు బుద్ధా వెంకన్న వ్యవహారం ఇలాగే ఉంది. విషయం ఏమిటంటే మీడియాతో బుద్ధా మాట్లాడుతు అనేక విషయాలు చెప్పారు. అందులో కీలకమైనవి ఏమిటంటే యువగళం నారా లోకేష్ పాదయాత్రలో జనసేన నేతలు, క్యాడర్ కూడా పాల్గొంటుందన్నది. ఇది పార్టీలో జోష్ పెంచే విషయమే. ఇదే సమయంలో పార్టీలో ఇప్పటివరకు ఏ నియోజకవర్గంలో కూడా అభ్యర్ధులను ప్రకటించలేదన్నారు. ఒకవేళ ఎవరైనా తమను తాము అభ్యర్ధులుగా ప్రకటించుకుంటే పార్టీకి సంబంధంలేదన్నారు.

బుద్ధా చేసిన రెండో ప్రకటనపైనే బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ సందర్భాల్లో చంద్రబాబునాయుడు, లోకేష్ కొందరు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి సుమారు 30 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించుంటారు. డోన్, గన్నవరం, నంద్యాల, చంద్రగిరి, పుంగనూరు, ప్రొద్దుటూరు, కడప, పులివెందుల లాంటి  మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. నియోజకవర్గాల ఇన్చార్జిలనో లేకపోతే డైరెక్టుగా అభ్యర్ధులనే చంద్రబాబు, లోకేష్ ప్రకటించేశారు.

వీళ్ళ ప్రకటన కూడా నియోజకవర్గాల పర్యటనల్లోను, నేతల సమీక్షల్లో చేసినవే. దాంతో వాళ్ళంతా తామే అభ్యర్ధులం అన్న పద్దతిలో భారీగా ఖర్చులు చేసుకుంటున్నారు. డోన్, నంద్యాల లాంటి కొన్నిచోట్ల గొడవలు కూడా  అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే జనసేనతో పొత్తు కారణంగా వాళ్ళకి కేటాయించాల్సిన నియోజకవర్గాలు ఎన్ని, ఏవి అనే విషయంలో టీడీపీలో అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటికే అభ్యర్ధుల హోదాతో కొందరు తమ్ముళ్ళు ఖర్చులు పెట్టుకుని ఎన్నికలకు రెడీ  అవుతున్నారు. ఇలాంటి తమ్ముళ్ళకి ఎలా  నచ్చచెప్పాలన్నదే చంద్రబాబుకు తలనొప్పిగా  మారింది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే బుద్ధా చేసిన ప్రకటన పార్టీలో కొత్త చిచ్చుకు తెరలేపింది. అసలు బుద్ధా ఏ అధికారంతో ఈ ప్రకటన చేశారో ఎవరికీ అర్ధంకావటంలేదు. చంద్రబాబే ఈ ప్రకటనను బుద్ధాతో చేయించారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు తెలీకుండా బుద్ధా తనంతట తానుగా టికెట్ల విషయంలో ప్రకటన చేసే అవకాశంలేదు. బుద్ధా చేసిన ప్రకటన నిజమే అయితే మరి చంద్రబాబు మాటలకే విలువ లేదా అనే చర్చ కూడా మొదలైంది. ఏదేమైనా చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి భారీగా ఖర్చులు చేసుకోవటంతో పాటు అభ్యర్ధులుగా చేసుకున్న ప్రచారం అంతా ఉట్టిదేనా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో ఏమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: