- కాపు జాతిలో గొప్ప నేత‌... దివిసీమ గాంధీ గా పాపుల‌ర్‌
- గ‌ట్టిపోటీలో ఏపీ శాస‌న‌స‌భ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన నేత‌..!
- బాధ‌లో ఉన్నోళ్ల‌ను మ‌న‌మే వెతుక్కుంటూ వెళ్లాల‌ని స‌రికొత్త నిర్వ‌చ‌నం

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )
మండ‌లి వెంక‌ట కృష్ణారావు. ఈ పేరు తెలియ‌ని ఉభ‌య గోదావ‌రులు స‌హా ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల వారు ఉండ‌రు. ఇప్ప‌టి త‌రానికి ఆయ‌న తెలియ‌క పోవ‌చ్చు. కానీ, ఎక్క‌డో గుజ‌రాత్‌లో పుట్టిన గాంధీ గురించి.. మ‌నం తెలుసుకుంటున్నాం. అయితే.. ఆయ‌న దేశ‌వ్యాప్తంగా ప్రాముఖ్యం పొందారు. కానీ.. అంతే స్థాయిలో ప్ర‌జ‌ల‌కు సేవ చేసి.. ప్రాంతానికి సేవ చేసి.. సుభిక్ష స‌స్య‌శ్యామ‌ల‌.. జిల్లాల‌ను కోరుకున్న వ్య‌క్తిగా `దివిసీమ గాంధీ`గా పేరు తెచ్చుకున్న మండ‌లిని మ‌నం మ‌రిచిపోయాం.


స‌రే.. మండ‌లి వెంక‌ట కృష్ణారావు గురించి చెప్పాలంటే.. రాజ‌కీయంగానే కాదు.. వ్య‌క్తిత్వ ప‌రంగాను.. ఆయ‌న ఎన్న‌ద‌గిన స్థాయిలో ముందున్నారు. ఒక‌ప్ప‌టికి ఇప్ప‌టికి.. రాజ‌కీయాల్లో కులాలు, మ‌తాల‌కు ప్రాధాన్యం పెరిగిపోయింది. కానీ, అప్ప‌టి రాజ‌కీయాల్లో వ్య‌క్తిత్వం చూసి టికెట్‌లు ఇచ్చేవారు. ఇలా ఇచ్చిన‌ప్పుడు.. తొలి వ‌రుస‌లో తొలి పేరు మండలి వారిదే ఉండేదంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. కాని, ఇది నిజం. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1972 ఎన్నిక‌ల‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు ఆయ‌నేనంటే తెలుసా?


ఆయ‌న‌కు పోటీ పెట్ట‌బోమ‌ని పార్టీలు తీర్మానం చేసిన విష‌యం చాలా మందికి తెలియ‌దు. కానీ, ఆయ‌న అలాంటి నాయ‌కుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించిన ఆయ‌న అనతికాలంలోనే ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు అందుకున్నారు. కులం ప‌రంగా ఆయ‌న కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన వారు. కానీ, ప‌నితీరు, భావ‌వ్య‌క్తీక‌ర‌ణ వంటివాటిని చూస్తే.. ఆయ‌న కులాల‌కు అతీతుడు.. బాధ‌లు, స‌మ‌స్య‌లే ఆయ‌న‌కు ప్రాతిప‌దిక‌. ఈ రెండు కోణాల నుంచే ఆయ‌న‌ను చూడాల్సి ఉంటుంది.


`` బాధలలో ఉన్న వారు మ‌న‌ల్నివెతుక్కుంటూ రావ‌డం కాదు.. మ‌న‌మే వారిని వెతుక్కుంటూ వెళ్లాలి. అది నాయ‌కుడి ప్ర‌ధాన ల‌క్ష‌ణం`` అని నాయ‌కుడికి కొత్త అర్థం చెప్ప‌డ‌మే కాదు.. జీవితాంతం అలానే జీవించిన మండ‌లి నేటి త‌రం నాయ‌కులు ఒక ఐకాన్‌. దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచ‌డం ద్వారా వారికి ఆస్థిపై హ‌క్కు క‌ల్పించారు. విద్యా,  సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా త‌న దైన ముద్ర వేశారు. స్వ‌భాష అంటే ప్రాణం పెట్టిన మండ‌లి.. తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.


`` ఒక కులం ప్రాతిప‌దిక‌గా కాకుండా.. ఒక జాతి ప్రాతిప‌దిక‌గా రాజ‌కీయాలు సాగిన‌నాడు.. ఈ దేశం .. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతాయి `` అని అసెంబ్లీనే చాటి చెప్పిన మండ‌లి .. జీవితాంతంఇదే సిద్ధాంతాన్ని పాటించారు. ఇదే ఆయ‌న‌ను అనేక మంది నాయ‌కుల్లో ముందు వ‌రుస‌లో నిలిపేలా చేసింది. ఆయ‌న త‌రం నుంచి వ‌చ్చిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ కూడా తండ్రిబాట‌లో ప‌య‌నిస్తూ.. ఆద‌ర్శ రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా నిలిచార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాజశేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక మండ‌లి వెంక‌ట కృష్నారావు పేరే గుంటూరు - కృష్నా జిల్లాల‌ను క‌లిపే అవ‌నిగ‌డ్డ వార‌ధికి పెట్టారు. ఆయ‌న ఈ రోజు లేక‌పోయినా దివిసీమ‌తో పాటు ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో ఆయ‌న చేసిన సేవ‌లు, ఆయ‌న వ్య‌క్తిత్వం ఎప్ప‌ట‌కీ చ‌రిత్ర‌లో అలా ఉండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: